పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలి – కలెక్టర్ బదిలీకి డిమాండ్
ఆదిలాబాద్, నవంబర్ 1 : పత్తి ధర విషయమై కలెక్టర్‌కు, రైతు సంఘాల నేతల మధ్య వివాదం నెలకొంది. వ్యాపారస్తుల పక్షాన మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ను వెంటనే బదిలీ చేయాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పక్షాన ఉండాల్సిన కలెక్టర్ వ్యాపారస్తులను వేనకేసుకొని రావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పత్తి కొనుగోలు ప్రారంభం రోజు పత్తి క్వింటాళ్లుకు 4100 నిర్ణయించినప్పటికీ దానికి భిన్నంగా క్వింటాలుకు 300 తగ్గించడంతో ఆందోళనకు దిగిన రైతులకు బాసటగా నిలవాల్సిన కలెక్టర్ ప్రైవేటు వ్యాపారస్తులను అండగా నిలవడాన్ని రైతు సంఘం నాయకులు నిలదీస్తున్నారు. తేమ శాతాన్ని సాకుగా చూపి వ్యాపారస్తులు ధర విషయంలో రైతులను మోసం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఎలాక్ట్రానిక్ యంత్రాల ద్వారా పత్తిని తూకం వేసేవారని ఇప్పుడు తేమ యంత్రాలతో జిల్లా కలెక్టర్ పత్తి కొనుగోళ్లను చేయించడాన్ని తప్పుబడుతున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి రైతులపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని ఖండిస్తు వెంటనే జిల్లా కలెక్టర్‌ను తప్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.