పత్తి కొనుగోలులో ప్రతిష్టంభన

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 31 : పత్తి ధర విషయంలో జిల్లా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. పత్తి కొనుగోలు ప్రారంభించిన మొదటి రోజు అట్టహాసంగా ప్రారంభించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు, వ్యాపారస్తులు పాల్గొని పత్తి క్వింటాలుకు రూ.4100 నిర్ణయించారు. ఆ ధర కేవలం ఒక్క రోజు మాత్రమే కొనసాగి, రెండవ రోజు 3800 మాత్రమే ఇస్తామనడంతో రైతులు ఆందోళనకు దిగాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం 5గంటల వరకు రాస్తారోకోతో పాటు, ఆదిలాబాద్‌ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. అయితే ఉన్నతాధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ రాకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిన పంటలకు గిట్టుబాట ధర కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు దుయ్యబట్టారు. ప్రారంభం రోజు జిల్లా కలెక్టర్‌ వ్యాపారస్తులను ధర విషయంలో ప్రదేయ పడడాన్ని వారు ఖండిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆశ్రద్ద కారణంగా కొందరు వ్యాపారస్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటున్నారు. పత్తి ధర 4500 నిర్ణయించి, తేమను సాకుగా చూపించి ధరను తగ్గిస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం పత్తి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.