పత్తి పరిశ్రమలకు అందని రాయితీ ఆందోళనలో ఉపాధి కూలీలు

 

కర్నూలు,నవంబర్‌11(జనం సాక్షి): పత్తి పరిశ్రమలు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని భావించి కొందరు రూ. కోట్లు పెట్టి పత్తి పరిశ్రమలను స్థాపించారు. అయితే గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పరిశ్రమల యజమానులకు రాయితీ ఇవ్వలేదు. రాయితీ విడుదల చేయకపోవడంతో పత్తి పరిశ్రమలు అప్పుల్లో కూరుకపోయాయి. ఇవి మూత పడితే వీటి విూద ఆధారపడిన వేలాది మంది వీధినపడే ప్రమాదం ఉంది. ఆదోని రాయలసీమలోని అతి పెద్ద వ్యవసాయ మార్కెట్‌ యార్డు. సీమ నుంచే కాక కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా రైతులు ఇక్కడికి పత్తి తీసుకొని వస్తారు. జిల్లాలో పండే పత్తికి విదేశాల్లోనూ మంచి డిమాండ్‌ ఉంది. దీంతో కొందరు పత్తి పరిశ్రమలను స్థాపించారు. సాంకేతిక పరిజ్ఞానంతో టీఎంసీ పత్తి పరిశ్రమలు కూడా రూ.13 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి స్థాపించారు. పత్తి పరిశ్రమలు స్థాపించిన వారికి పావలా వడ్డీ రాయితీ, వాణిజ్య పన్నుల విూద, విద్యుత్‌ బిల్లుల్లో రాయితీ కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పత్తి పరిశ్రమలను స్థాపించారు. అయితే పరిశ్రమలు పెట్టి ఐదేళ్లయినా ప్రభుత్వం రాయితీ ఇవ్వలేదు. దీంతో పరిశ్రమల యజమానులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వరుస కరువు వల్ల గత మూడేళ్లుగా దిగుబడులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రభుత్వం రాయితీ ఇస్తే బ్యాంకులకు చెల్లించాల్సిన వడ్డీ నుంచి ఉపశమనం పొందేవాళ్లమని పత్తి పరిశ్రమల యజమానులు అంటున్నారు. పరిశ్రమల యజమానులు విద్యుత్‌ బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి వెళ్లిపోయారు. పరిశ్రమలకు తీసుకున్న రుణంపై రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ చెల్లిస్తుంది. పరిశ్రమలు స్థాపించిన యజమానులకు పరిశ్రమల్లో యంత్ర పరికరాలు కొనుగోలు చేస్తూ 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ వర్తింపజేస్తామని ప్రభుత్వం సూచించింది. అందుకు ప్రభుత్వం ఇస్తున్న చేయూతను ఆసరగా చేసుకొని ఎంతో మంది పరిశ్రమలు స్థాపించారు. ప్రభుత్వం అందిస్తామన్న చేయూత రాయితీ రూపంలో రాకపోవడంతో ఈ నాలుగేళ్లలో దాదాపుగా రూ.15 కోట్లకు పైగా పరిశ్రమల యజమానులకు బకాయి పడ్డారు.  రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రాయితీ విడుదల చేయకపోవడంతో పత్తి జిన్నింగ్‌ పరిశ్రమలు కుంటుపడ్డాయి. ఇప్పటికే దాదాపుగా పదుల సంఖ్యలో మూతపడ్డాయి. అప్పులు చేసి పరిశ్రమలు స్థాపించిన యజమానులు వడ్డీలు చెల్లించలేక బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలు సకాలంలో చెల్లించలేక నోటీసులు అందుకుంటున్నారు. మార్కెట్‌ యార్డు, పత్తి పరిశ్రమలపై దాదాపుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మంది కూలీలు ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. గత వరుస కరువులతో ఇప్పటికే పరిశ్రమల్లో దిగుబడులు లేక కూలీలకు పనులు లేక వలసబాట పట్టారు. మరోవైపు కుంటుపడిన పరిశ్రమల వల్ల వేల మంది కూలీలు ఉపాధి కోల్పోయారు.