పత్తి మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులు

– ఆదిలాబాద్‌లో రాస్తారోకో

– 5 కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్‌

ఆదిలాబాద్‌, అక్టోబర్‌ 30 : పత్తి ధరను తగ్గించారని ఆగ్రహించిన రైతులు రాస్తారోకో నిర్వహించి బంద్‌కు పిలుపునివ్వడంతో ఆదిలాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సోమవారం నుంచి పత్తికొనుగోళ్లు ప్రారంభించి క్వింటాలు పత్తికి రూ.4100 ఇస్తామని కలెక్టర్‌ సమక్షంలో వ్యాపారస్థులు ఒప్పుకుని పత్తిలో తేమ ఉందన్న సాకుతో పత్తి క్వింటాలుకు 300 రూపాయలకు తగ్గించడంతో రైతులు మంగళవారం ఎడ్లబండ్లతో రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని కిసాన్‌ చౌక్‌ వద్ద సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో వల్ల రోడ్డుకు ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు, ప్రజాప్రతినిధులు  రాకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఆదిలాబాద్‌ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో బంద్‌ కొనసాగుతోంది. రైతుల ఆందోళనకు అఖిలపక్షం నాయకులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వం పత్తి క్వింటాలుకు రూ.3900 ప్రకటించడం జరిగిందని, ప్రైవేటు వ్యాపారస్థులు ముందుకు వచ్చి పత్తి క్వింటాల్‌కు అదనంగా రూ.200 పెంచి 4100 రూపాయల మద్దతు ధరను ప్రకటించారు. పత్తి కొనుగోళ్లు రెండవ రోజైన మంగళవారం పత్తి క్వింటాల్‌కు రూ.3900 ఇస్తామని వ్యాపారులు ప్రకటించడంతో రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు. పత్తి క్వింటాల్‌కు రూ.6వేల రూపాయలు చెల్లిస్తే తప్ప గిట్టుబాటు కాదని రైతులు స్పష్టం చేస్తున్నారు. తేమ ఉందనే సాకుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వ్యాపారులు రైతులను నష్టపరుస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు చేపట్టిన రాస్తారోకో వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో పోలీసులు జోక్యం చేసుకుని నచ్చజెప్పినప్పటికీ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు స్వల్పంగా రైతులను చెదరగొట్టారు. పత్తి క్వింటాల్‌కు మద్దతు ధర ప్రకటించేవరకు కొనుగోళ్లు చేపట్టవద్దని రైతులు డిమాండ్‌చేస్తున్నారు. అధికారులు జోక్యం చేసుకుని తమకు నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.