పత్తి వ్యాపారులపై చర్యలు తీసుకోండి
ఆదిలాబాద్, నవంబర్ 1 : తేమను సాకుగా చూపి పత్తి ధరను తగ్గించడంపై వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తేమ శాతాన్ని ఎనిమిదికి కుదించడంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు పేర్కొన్నారు. చలికాలంలో పంట పొలాల్లో తేమ అధికంగా ఉంటుందని, తేమ శాతాన్ని 12 శాతం వరకు పెంచాలని రైతులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ పెట్టుబడులు పెరిగిపోయాయని, పంటలు కూడా దిగుబడి లేక కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అటు గిట్టుబాటు ధర లేక, ఇటు తేమతో పత్తి ధరను మరింత తగ్గించడంపై రైతులు అన్ని విధాలుగా నష్టపోతునందున ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. మహారాష్ట్రలో పత్తి ధర ఎక్కువగా ఉన్నందున తమ పత్తికి మహారాష్ట్రలో అమ్ముకునే విధంగా రైతులకు అనుమతి ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు.