పత్తి సాగులో మెళకువలు పాటిస్తే అధిక లాభాలు
జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్
కుల్కచర్ల,సెప్టెంబర్ 14(జనం సాక్షి):
రైతులు పత్తి సాగులో అధిక మెళకువలు పాటిస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు.బుధవారం కుల్కచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామంలో రైతులు జుట్టు అనంతరెడ్డి, జుట్టు చెన్నారెడ్డి, సుల్తాన్ పూరం నరసింహారెడ్డి పొలాల్లో అధిక సాంద్రతలో పండించిన పత్తి పంటను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు పత్తి మొక్కలు 45 నుండి 60 సెంటీమీటర్లు ఎదిగిన తర్వాత మెపీక్వాట్ క్లోరైడ్ ద్రవణాన్ని ఎకరానికి 120 మిల్లీమీటర్లు పిచికారి చేసి మొక్కను ఎక్కువ ఎత్తు పెరగడాన్ని ఆపాలని తెలిపారు.5 ప్యాకెట్ల విత్తనాలతో ఎకరాకు 25 వేల మొక్కలు పెట్టడం వల్ల ఎక్కువ కాయలు కాసి ఎక్కువ దిగుబడి వస్తుందని ఆయన సూచించారు.పత్తి పంట సాగులో తెగుళ్ల నివారణకు రైతులకు తగు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరస్వామి, వ్యవసాయ విస్తరణ అధికారి శివాని బాబు, గ్రామ రైతు బంధు సమన్వయకర్త వెంకటయ్య, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.