పథకాల ప్రకటనతో ప్రజలకు భరోసా దక్కేనా?

ఎర్రకోట విూదుగా మరోమారు ప్రధాని మోడీ కోటి ఆశలు కల్పించారు. ఉపాధి కలుగుతుందని చెప్పారు. కోటికోట్ల రూపాయలతో కొత్తగా ఆశలు కల్పిచారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రకటించినా అవి సామాన్యుల దరి చేరడం లేదు. దేశంలో దరిద్రం తీరడం లేదు. ప్రభుత్వం పథకాల పేర్లు చెప్పి చాంతాడంత లిస్టు చదువుతూ వస్తుందే తప్ప ప్రజలకు నేరుగా ప్రయోజనం కలిగించే పనులేవీ జరగడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించడం లేదు. అయినా ఆశగానే ఉన్నారు. ఇంకా ఏదో చేస్తారనే భరోసాలో బతుకుతున్నారు. నోట్లు రద్దు చేసినా, జిఎస్టీ వాతలు పెట్టినా భరిస్తున్నారు. ఈ భరింపు ఎంతకాలం అన్నది ప్రధాని మోడీ ఆలోచించుకోవాలి. తాజాగా యువతకు ఉపాధి, స్థానిక కంపెనీలకు చేయూత లక్ష్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారీ పథకాన్ని ప్రకటించారు. స్వాతంత్య దినోత్సవాల సందర్భంగా ఎర్ర కోట నుంచి మాట్లాడుతూ, రూ.1 కోటి కోట్లతో ’గతిశక్తి’ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీంతో భవిష్యత్తులో కొత్తగా ఆర్థిక మండళ్ళ ఏర్పాటుకు అవకాశం లభిస్తుందన్నారు. నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను కూడా ప్రకటించారు.
ప్రధాన మంత్రి గతి శక్తి నేషనల్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్ర్‌ మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. స్థానిక మాన్యుఫ్యాక్చరర్లు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు, సమగ్ర మౌలిక సదుపాయాల వృద్ధికి ఈ పథకం దోహదపడుతుందన్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థకు సమగ్ర మార్గాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారుచేయడానికి మనమంతా కలిసి పని చేయాలన్నారు. కటింగ్‌ ఎడ్జ్‌ ఇన్నోవేషన్‌, న్యూ ఏజ్‌ టెక్నాలజీలను ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను తయారు చేయాలన్నారు. దేశాన్ని గ్రీన్‌ హైడ్రోజన్‌ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నేషనల్‌ హైడ్రోజన్‌ మిషన్‌ను కూడా ప్రకటించారు. దీంతో గ్రీన్‌ హైడ్రోజన్‌ను పెద్ద ఎత్తున ఎగుమతి చేసే దేశంగా భారత్‌ మారుతుందన్నారు. గ్రామాలు వేగంగా మారుతుండటాన్ని మనం గమనిస్తున్నామన్నారు.
75 వారాలపాటు జరిగే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా 75 వందే భారత్‌ రైళ్ళు దేశంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తాయన్నారు. నిజానికి ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి. అయితే క్షేత్రస్థాయిలో ఏ మేరకు ఇవి పనిచేస్తాయన్నదే ముఖ్యం. విశాక ఉక్కు పరిశ్రమను బలోపేతం చేసి మరో వేయిమందికి ప్రత్యక్షంగా పదివేల మందికి పరోక్షగా ఉపాధి కల్పించవచ్చు. కొత్తగా ఉక్కు ఫ్యాక్టరీలు నెలకొల్పకున్నా బయ్యారం, కడప ఉక్కు గనులను ఉపయోగించి విశాఖ ఉక్కును బలోపేతం చేయవచ్చు. కానీ అలా చేయకుండా కొత్త పథకాలతో ఆకర్శించడం, ఉన్నవాటిని తెగనమ్మడంపై ప్రధాని మోడీకి మోజు ఎక్కువగా ఉందని అర్థం అవుతోంది. విశాఖ ఉక్కు ఎందరో ప్రాణత్యాగాలతో ఏర్పాటయిన విషయం మోడీ పరిశీలించినట్లు లేదు. అలాగే అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని ప్రధాని మోడీ గతంలో ప్రకటించారు. గత ఏడేళ్లుగా ఆయన స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా చేసిన ప్రసంగాలను పరిశీలించుకుని లేదా అవలోకించి నాటి ప్రమాణాలను గుర్తు చేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మననం చేసుకోవాలి. గత ఏడేళ్లుగా చెబుతున్న ఏ ఒక్కటి కూడా కార్యాచరణకు రావడం లేదు. జిఎస్టీ వల్లే దేశంలో మార్పు వచ్చిందని ఘనంగా చెబుతున్న ప్రధాని దాని విపరీత పరిణామాలను కూడా పరిగణించాలి. అవినీతిని అంతమొందించే క్రమంలో చిత్తశుద్దితో సాగితే ప్రజలు అండగా ఉంటారని గుర్తించాలి. ఇకనుంచి పేదలను దోచుకునేవారికి కంటి విూద కునుకు లేకుండా చేస్తామని, నిజాయితీ పరులకు ప్రోత్సాహం అందిస్తామని ఎర్రకోట సాక్షిగా ప్రధాని గతంలో ప్రకటించారు. జీఎస్టీతో కొత్త చరిత్ర సృష్టించా మని.. కొత్త పన్ను విధానానికి అందరి మద్దతు లభిస్తోందని తెలిపారు. మధ్యతరగతి వారి సొంతింటి కలను నిజం చేస్తామని
హామి ఇచ్చారు. కానీ గృహనిర్మాణ రంగం సామాన్యులకు అందకుండా పోయింది. సిమెంట్‌, ఐరన్‌ ధరలు పెరగడం వంటి చర్యలకు తోడు బ్యాంకులు కూడా సామన్యులకు తోడుగా నిలవడంలేదు. స్వతంత్ర భారతానికి నేటితో డెబ్బయి ఐదేళ్లు నిండాయి. స్వాతంత్యద్రినోత్సవ సంబరాల్లో యావత్‌ దేశం మునిగి పోయింది. ఏదో జరుగుతందని, ఏదో చేస్తారని ఇంకా ప్రజల్లో ఆశ ఉంది. అయినా ప్రధాని ప్రసంగం ఉత్సాహం నింపేలా, ఆశలు కల్పించేలా లేదు. తాను చేపట్టిన పథకాలను ప్రచారం చేసుకునేలా ఉంది. తాను చేస్తున్న కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో ప్రజల మద్దతు కోరేలా ఉంది. కూడు, గుడ్డ, విద్య, వైద్యం ప్రజల ప్రాధమిక హక్కుగా ఉండాలంటూ రాజ్యాంగ సృష్టికర్తలు శ్రేయో రాజ్యాన్ని ప్రతిపాదిం చగా ఇన్నేళ్లయినా అది సాకారం కాలేదని ప్రస్తుత పరిస్థితులు చెబుతున్నాయి. ఈ ఏడేళ్లలో వాటిని అధిగమించడానికి ప్రధానిగా మోడీ తీసుకున్న చర్యలు ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు. దశాబ్దాల స్వతంత్ర భారతంలో స్వేచ్ఛాఫలాలు సామాన్యుడి చెంతకు చేరలేదని నిత్యం ఘోషిస్తున్నా పాలకులకు పట్టడం లేదు. అన్నిరంగాలను నిర్వీర్యం చేసి కార్పొరేట్లకు సలాం కొడుతున్న ఆత్మగౌరవ రాహిత్యం తాండవి స్తోంది. అడుగడుగునా పాలనా వైఫల్యం కనిపిస్తున్నా దానిగురించి కప్పిపుచ్చుకుంటూ ప్రచారార్భాటలు చేయడం అలవాటుగా మారింది. కుల, మతాల పేరుతో ఓట్లు దండుకునే కుటిల వ్యూహాలు, ప్రజలను బిచ్చగాళ్ళను చేసే వాగ్దానాల వాగాడంబరాలు, విజ్ఞత లోపించిన నేతలు ప్రజలతో ఆడుకొనే క్రూర పరిహా సంగా మారింది. పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల పాదాక్రాంతం చేయడం, బ్రిటిష్‌ సామ్రాజ్య వాదాన్ని ఎదిరించిన వీరుల త్యాగాలకు తిలోదకాలివ్వడం, అంబానీలు, అదానీల అంతులేని ధనార్తికి దోహదం చేయడం తప్ప సాధించేదేవిూ లేదని గుర్తించుకోవాలి. దేశ చరిత్రలో 75 ఏళ్లు అంటే తక్కువ సమయమేవిూ కాదు. పాలకులు చిత్తశుద్ధిగా ప్రజల సంక్షేమాన్ని కోరుకుని ఉంటే భరాత చరిత్ర మరోలా ఉండేది.

తాజావార్తలు