పదవుల రక్షణకే ప్రాధాన్యత..: రమేష్ రాథోడ్
ఆదిలాబాద్, అక్టోబర్ 7 : రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిపోయిందని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ముఖ్యమంత్రితోపాటు మంత్రులు పదవులు కాపాడుకోవడంలో నిమగ్నమైనారని ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్ ఆరోరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి,అక్రమాల్లో కూరుకుపోయిందని, ఇటు కాంగ్రెస్ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. పెరిగిన ధరలతో, విద్యుత్ కోతల వల్ల రైతులు పూర్తిగా నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. జిల్లాలో ప్రజలకు కనీస వసతులు కరవు అయ్యాయని అనేక గ్రామాలకు రోడ్లు లేక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. తమ అధినేత చంద్రబాబు చేపట్టిన యాత్రకు ప్రజల నుండి భారీగా స్పందన వస్తుందని కాంగ్రెస్ పాలనతో విసిగిపోయామని ప్రజలు చంద్రబాబుకు తెలియజేయడం ఇందుకు నిదర్శనమని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఎన్నికలు ఈ నెల 10వ తేదీన ఆదిలాబాద్‌లో నిర్వహిస్తునట్టు ఆయన పేర్కొన్నారు.