పబ్లిగ్గా మందుకొడితే జరిమానే

– త్వరలో గోవాలో అమల్లోకి
– వెల్లడించిన గోవా సీఎం మనోహర్‌ పారికర్‌
పనాజీ, జులై17(జ‌నం సాక్షి) : బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే జరిమానాలు విధిస్తామని గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ వెల్లడించారు. దానికి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తామని చెప్పారు. పబ్లిక్‌గా మందు తాగితే రూ.2,500 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. ‘గుర్తుంచుకోండి, ఆగస్టు నుంచి బహిరంగంగా మద్యం సేవిస్తే భారీ జరిమానాలు ఉంటాయి. త్వరలోనే నోటిఫికేషన్‌ జారీ చేస్తాం. ఆగస్టులోపే ఈ విధానం అమలు చేయాలని అనుకున్నాం. కాబట్టి ఆగస్టు 15 నుంచి అమలులోకి తెస్తామని పారికర్‌ స్పష్టంచేశారు. రోడ్లపై ఖాళీ బీరు సీసాలు పడి ఉంటున్నాయని, ఇటీవల అభివృద్ధి చేసిన రివర్‌ ఫ్రంట్‌ ప్రాంతంలో కాలేజీ విద్యార్థులు బీర్లు తాగుతూ కనిపిస్తున్నారని పారికర్‌ వెల్లడించారు. ‘ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు బీరు బాటిళ్లు పట్టుకుని వెళ్తుండడం చూశాను. ఇలా జరగకూడదు’ అని అన్నారు. ఖాళీ బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయడం వల్ల మిగతా ప్రజలకు ప్రమాదమని అన్నారు. గతంలో పారికర్‌ ఓ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ ఈ మధ్య అమ్మాయిలు కూడా బీర్లు తాగుతున్నారని, ఇది మంచిది కాదని అన్నారు. దీనిపై అప్పట్లో వివాదం చెలరేగింది.