పరాయీకరణ….

మీరిలాగే….
జఢత్వపు ముసుగుతన్ని
మొద్దు “నిద్దుర” తీయండి
వాళ్ళు “వేకువ” పొద్దును
ఎగరేసుకు పోతుంటారు

భయం మాటున దాక్కుని…
బతుకు క్షణాల లెక్కించండి
వాళ్ళు “భవిత” రాశుల
బలాదూర్ గా పోగేసుకుంటారు

అంధ విశ్వాసాల శ్వాషిస్తూ…
బండరాళ్లకు “భజన”లు చేయండి
వాళ్ళు మరిన్ని మందిరాలకు
పునాదులు తీస్తుంటారు

నిర్లక్ష్యపు రెక్కలు విచ్చుకు…
ఊహ “లోకం”లో ఊరేగండి
వాళ్ళు “హక్కు”ల కుత్తుక కత్తిరించ
కుట్రలకు పదును పెడతుంటారు

ఆత్మ వంచనల పంచన చేరి….
అంతకంతకూ కూరుకుపోండి
వాళ్ళు రాజ్యాంగ పేజీల ఏమార్చ
ఎత్తుగడల రచిస్తుంటారు

కూపస్థమండూక రూపుదాల్చి….
అక్కడక్కడే తచ్చాడండి
వాళ్ళు  “పొరసత్వం” పేర
తాత ముత్తాతల నాటి “నిశాన”
చూపమని “హుకుం” జారిచేస్తారు

అప్పుడు….
పుట్టి పెరిగిన “గడ్డ” మీదే
“పరాయికరణ” చెందండి
కాదంటే…
మరో చోటికీ “కాందిశీకు”లై తరలిపోండి

ఎందుకంటే?
ఎదురించటం చేతకాక
ఎలాగోలా “చస్తూ” బతకడం
అలవాటు చేసుకున్నోళ్లు కదా!

“””””””””””””””””””
(పౌరసత్వ చట్ట సవరణపై మౌనం దాల్చు
కుహానా మను(సు)షుల  ఉద్దేశిస్తూ…)

కోడిగూటి తిరుపతి
Mbl no:9573929493

తాజావార్తలు