పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు : డీఈవో
కరీంనగర్,మార్చి3(జనంసాక్షి): జిల్లాలో టెన్త్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా విద్యాధికారి లింగయ్య అన్నారు. సెంటర్లను గుర్తించి అక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూస్తున్నామని చెప్పారు. ఆయా సెంటర్ల వద్ద బందోబస్తుతో సహా అన్ని ఏర్పాట్లపైనా దృష్టి పెట్టామని చెప్పారు. ఈనెల 25 నుంచి ఏప్రిల్-8 వరకు జరిగే పదో తరగతి పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 274 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మరో వారం రోజుల్లో ఇన్విజిలేషన్ పక్రియ పూర్తవుతుందని వివరించారు. స్జబెక్టు పరీక్షలు జరిగే రోజు సంబంధిత స్జబెక్టులు బోధించే ఉపాధ్యాయులను విధులకు దూరంగా ఉంచుతామని చెప్పారు. కేంద్రాల వద్ద వసతులు కల్పించే విషయంలో నిర్లక్ష్యం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 63,319 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, ఇందులో 58,319 మంది రెగ్యులర్, 4,761 మంది ప్రయివేటు విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు.