పరుగుల సునామి సృష్టించాడు

88హైదరాబాద్‌: టెస్ట్‌ క్రికెట్‌లో ద్విశతకం, త్రిశతకాలు చేస్తే గొప్పగా చెప్పుకుంటాం… అదే వన్డేల్లో అయితే డబుల్‌ సెంచరీ మార్కును నలుగురు క్రికెటర్లు తప్ప మరెవరూ ఇప్పటివరకు చేరుకోలేకపోయారు. మరి ఒక ఆటగాడు ఒకే ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులు చేస్తే… వూహించుకోవడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ… ఇది వూహ కాదు నిజం. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు 15ఏళ్ల ముంబయి కుర్రాడు ప్రణవ్‌ ధనవాడే.

ముంబయి క్రికెట్‌ క్లబ్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తున్న ఇంటర్‌ స్కూల్‌ లెవల్‌ టోర్నమెంట్‌లో ప్రణవ్‌ రికార్డుల మోత మోగించాడు. ఆర్యా గురుకుల్‌ పాఠశాల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌ ప్రణవ్‌ ఏకంగా1009 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. నిన్న 199 బంతుల్లో 652 పరుగులు సాధించిన ప్రణవ్‌ రెండోరోజు మరింత రెచ్చిపోయి ప్రత్యర్థి బౌలర్లను వూచకోత కోశాడు. 321.38 స్రైక్‌రేట్‌తో 395 బంతుల్లోనే 1009 పరుగులు సాధించాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ప్రణవ్‌ మారథాన్‌ ఇన్నింగ్స్‌లో 59 సిక్స్‌లు, 129 ఫోర్లు ఉన్నాయి.

ఈ ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్‌లో ప్రణవ్‌ సంచలనం సృష్టించాడు. 1899వ సంవత్సరంలో ఆర్థన్‌ కోలింగ్‌ చేసిన 628 పరుగులే ఇప్పటివరకు ఏ విభాగంలోనైనా అత్యధిక స్కోరుగా రికార్డులో ఉంది. 116 సంవత్సరాల తర్వాత ఆ రికార్డును ముంబయి కుర్రాడు తిరగరాశాడు. ప్రణవ్‌ తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.