పలమనేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో..
మంత్రి అమరనాథరెడ్డి ఆకస్మిక తనిఖీలు
– అధ్యాపకులతో సమావేశమైన మంత్రి
– సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హావిూ
తిరుపతి, సెప్టెంబర్28(జనంసాక్షి ) : పలమనేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంత్రి అమరనాథ రెడ్డి
శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో లెక్చరర్లు, మహిళా లెక్చరర్లు కలిసి కళాశాల ప్రిన్సిపల్ పై ఆర్జేడీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంత్రి శుక్రవారం కళాశాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమరనాథరెడ్డి కళాశాలలోని హాస్టల్, వంట గది, లైబ్రరీ, ల్యాబ్లను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులు, అధ్యాపకులతో విడివిడిగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు హాస్టల్‌లో వసతి, భోజనం, ల్యాబ్, లైబ్రరీ, నీటి కొరత తదితర అంశాలపై మంత్రికి ఫిర్యాదు చేశారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామని, విద్యార్థులు బాగా చదువుకోవాలని మంత్రి విద్యార్థినులకు సూచించారు. అనంతరం అధ్యాపకులతో సమావేశం నిర్వహించి విచారించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మంత్రికి పలు సమస్యలు వినతి పత్రం రూపంలో అందించారు. కళాశాలలో ప్రిన్సిపల్ వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని మంత్రికి వివరించారు. ప్రిన్సిపల్ కళాశాలకు మద్యం తాగి వస్తున్నాడని పలువురు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అన్ని సమస్యలు త్వరలో పరిష్కారిస్తామని అధ్యాపకులతో మంత్రి హావిూ ఇచ్చారు. అనంతరం మంత్రి విూడియాతో మాట్లాడుతూ.. కళాశాలకు ఎంతో మంచి పేరుఉందని, అలాంటిది ప్రిన్సిపల్ అసమర్థత కారణంగా చెడ్డపేరు వస్తోందని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ పై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.