పవన్‌ కల్యాణ్‌ని కలుపుకొని పోతాం..!

– కేంద్రాన్ని వ్యతిరేకించేవారినందరికీ కలుపుకొని వెళ్తాం
– తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి
అమరావతి, జనవరి22(జ‌నంసాక్షి) : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని,  కేంద్రాన్ని వ్యతిరేకించే వారందరినీ కలుపుకొని పోతామని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమండ్రిలో ఈనెల 27వ తేదీన నిర్వహించనున్న టీడీపీ జయ¬ బీసీ సదస్సుకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. మాట్లాడుతూ. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను విమర్శించొద్దని పార్టీ అధిష్టానం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలూ రాలేదని బుచ్చయ్యచౌదరి స్పష్టం చేశారు. అధిష్టానం నుంచి తమకు ఆదేశాలు వచ్చినట్టు ప్రసారమవుతున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న కేసీఆర్‌తో జగన్‌ చేతులు కలపడం సరికాదని అభిప్రాయపడ్డారు. జగన్‌ని గతంలో వరంగల్‌లో టీఆర్‌ఎస్‌ నేతలు తరిమితరిమి కొట్టారని.. అయినా పౌరుషం లేకుండా కేసీఆర్‌తో ఆయన కలుసున్నారని విమర్శించారు. రాఫెల్‌ డీల్‌ ద్వారా వచ్చిన రూ.43 వేల కోట్లను మోడీ.. కేసీఆర్‌, జగన్‌లకు పంచిపెడుతున్నారని గోరంట్ల ఆరోపించారు. కేంద్ర మంత్రి గడ్కరీ.. ఏపీ విషయంలో కక్కలేక మింగలేక వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం తప్పుడు సమాచారం ఇస్తుందని విమర్శించారు. పోలవరంపై మాటలే తప్ప నిధులు ఏవని ప్రశ్నించారు. బీజేపీ నేతలు రాష్ట్రపతి పాలన పెట్టిస్తానన్నారని, దమ్ముంటే పెట్టించండి అంటూ సవాల్‌ చేశారు. చరిత్రే బీజేపీ నేతలకు సమాధానం చెబుతుందని బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు.