పవన్ నోరు అదుపులో పెట్టుకో
– వ్యాఖ్యలపై మండిపడ్డ బోండా ఉమ
విజయవాడ, సెప్టెంబర్27(జనంసాక్షి) : పవన్ కళ్యాణ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రౌడీ ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తోందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఉమామహేశ్వరరావు తిప్పికొట్టారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యలను బేరీజు వేసుకుని మాట్లాడాలని సూచించారు. దెందులూరు శాసన సభ్యుడు చింతమనేని ప్రభాకర్‌పై ఆయన చేసిన ఆరోపణలు సరికావని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంలో ఉండగా చేసిన రాజకీయ పోరాటాలపై పెట్టిన కేసులనే పవన్ ఎత్తి చూపిస్తున్నారని.. ఏ రాజకీయ నాయకుడిపై అయినా అలాంటి కేసులు ఉండటం సహజమని అన్నారు. మూడేళ్లపాటు టీడీపీతో కలిసి పనిచేసిన పవన్‌కు ఇప్పుడే కేసులు కనిపించాయా అని బోండా ప్రశ్నించారు. మహిళా అధికారిపై దాడులు చేశారంటూ వ్యాఖ్యానించిన పవన్ అందులో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. ఓ రాజకీయ పార్టీ అధినేతగా పవన్ విజ్ఞత ప్రదర్శించాలని హితవు పలికారు.