పసలేని మోదీ సభ..
` ఆర్భాటమే తప్ప.. ఆకట్టుకోని ప్రసంగాలు
` భాజపా శ్రేణులను నిరాశపరిచిన ‘భారీ’సభ
` పేరుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు.. చర్చంతా తెలంగాణలో పట్టుకోసమే!
` జాతీయ కార్యవర్గ సమావేశాల విూద కొండంత ఆశలు పెట్టుకున్న బీజేపీ నాయకులు
` వేడుకునే ధోరణిలో కొనసాగిన బండి సంజయ్ ప్రసంగం
` కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షాల మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వం విూద ఆరోపణలు
` కనీసం కెసిఆర్, టీఆర్‌ఎస్ పేరెత్తకుండానే కొనసాగిన మోడీ స్పీచ్
` సిఎం కెసిఆర్ సంధించిన ప్రశ్నల ఊసెత్తని బీజేపీ నాయకులు
` చెప్పుకోవడానికి చేసిందేవిూ లేకనే బీజేపీ నాయకుల పసలేని ఆరోపణలు అంటున్న టీఆర్‌ఎస్ నాయకులు
హైదరాబాద్,జూలై 4(జనంసాక్షి): ‘కొండంత రాగం తీసి పితుకంత పాట పాడినట్లే ఉంది బీజేపీ జాతీయ కార్యవర్గసమావేశాల తీరు’ అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. రెండు రోజుల జాతీయ కార్యవర్గసమావేశాల నిర్వహణ కోసం దాదాపు మూడు నెలల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించిన బీజేపీ నాయకులు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ఈనెల రెండు, మూడు తేదీలలో జాతీయ కార్యవర్గసమావేశాల అనంతరం ముగింపు రోజైన ఆదివారం నాడు ‘విజయ సంకల్ప సభ’ పేరుతో సికిందరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దేశంలోని బీజేపీ అతిరథ మహారథులందరూ ఈ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ కు ఒకట్రెండు రోజుల ముందే విచ్చేశారు. యావత్ బీజేపీ కార్యవర్గంతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. దేశ నలుమూలల నుండి వచ్చిన బీజేపీ నాయకులు తెలంగాణ వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో ఉన్న పార్టీ పరిస్థితిని అంచనా వేసి సమావేశాలకు ముందే అధిష్టానానికి నివేదికలు సమర్పించారు. మూడు నెలలుగా చేసిన హడావుడిని చూసి స్థానిక బీజేపీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా జాతీయ కార్యవర్గ సమావేశాల విూద కొండంత ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ దూకుడు పెంచిన నేపత్యంలో బీజేపీ అధిష్టానం రాబోయే ఎన్నికల కోసం స్పష్టమైన దిశా నిర్దేశం చేస్తుందని భావించారు. కానీ లక్షలాది మంది పాల్గొన్న బహిరంగ సభలో ప్రసంగించిన ఏ ఒక్క నాయకుడి ప్రసంగం కూడా వారిని ఆకట్టుకోలేకపోయింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగం వేడుకున్న ధోరణిలో కొనసాగింది. వ్యక్తి పూజకు దూరం అని చెప్పుకునే పార్టీలో ‘నా దేవుడు మోడీ’ అని బండి సంజయ్ మళ్లీమళ్లీ చెప్పుకోవడం ఎబ్బెట్టుగా అనిపించింది. తెరాస పార్టీకి కాళేశ్వరం ఎటిఎంలా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా తన ప్రసంగంలో ఆరోపించారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం విూద ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉందని సాధారణ ప్రజలు కూడా అనుకుంటున్నారు. గతకొన్ని రోజులుగా ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు తెరాస నాయకులు బీజేపీ విూద తీవ్రమైన మాటల దాడి చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ బహిరంగంగా సమాధానం చెప్పాలంటూ బీజేపీ బహిరంగ సభకు ముందు రోజు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ కొన్ని ప్రశ్నలు సంధించారు. తగ్గిన రూపాయి విలువ, పెరిగిన పెట్రోలియం ధరలు, పెరిగిన నల్లధనం లాంటి అంశాలను సిఎం కెసిఆర్ తన ప్రశ్నలలో లేవనెత్తారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా బీజేపీ నాయకులెవరూ కూడా కెసిఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితే కనీసం ముఖ్యమంత్రి కెసిఆర్ పేరు కూడా ఎత్తలేదు. దీనితో తెరాస నాయకులు, మంత్రులు బీజేపీ విూద తమ దాడిని మరింత ఉదృతం చేశారు. బీజేపీ నాయకులు చెప్పుకోవడానికి చేసిందేవిూ లేదు కాబట్టే అడిగినవాటికి సూటిగా సమాధానాలు చెప్పడం లేదని అంటున్నారు. కేంద్ర మంత్రులు సైతం గల్లీ లీడర్లలా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని తెరాస నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.