పసిడికి తగ్గిన డిమాండ్‌

– ఏప్రిల్‌-జూన్‌ తైమ్రాసికంలో 8శాతం తగ్గిన క్రయవిక్రయాలు
ముంబయి, ఆగస్టు2(జ‌నం సాక్షి) : బంగారం అంటే ఇష్టపడని ఆడవాళ్లు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పండగల దగ్గర్నుంచి విందులు, వివాహ వేడుకల వరకు సందర్భాన్ని బట్టి నగలను ధరించి మురిసిపోతుంటారు మన మగువలు. అయితే ఈ మధ్య మనదేశంలో పసిడికి డిమాండ్‌ కాస్త తగ్గిందట. ధరలు పెరగడం, స్థానిక పరిస్థితుల వల్ల ఏప్రిల్‌-జూన్‌ తైమ్రాసికంలో బంగారం కొనుగోళ్లు 8శాతం పడిపోయాయట. ఈ మేరకు వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌(డబ్ల్యూజీసీ) ఓ నివేదికలో తెలిపింది.
ఏప్రిల్‌-జూన్‌ మధ్య ప్రపంచవ్యాప్తంగా పసిడి క్రయవిక్రయాలపై గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ క్యూ2 2018 పేరుతో డబ్ల్యూజీసీ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం.. భారత్‌లో ఏప్రిల్‌-జూన్‌ తైమ్రాసికంలో 187.2 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయి. 2017 ఇదే తైమ్రాసికంలో 202.6 టన్నుల పసిడి కొనుగోళ్లు జరగగా.. ఈ సంవత్సరం 8శాతం తగ్గింది. విలువ పరంగా.. ఏప్రిల్‌-జూన్‌ మధ్య రూ. 52,692కోట్ల బంగారాన్ని కొనుగోలు చేశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈ విలువ దాదాపు సమానంగా ఉండటం గమనార్హం. 2017 ఇదే తైమ్రాసికంలో అమ్ముడైన 202.6టన్నుల బంగారం విలువ రూ. 52.750కోట్లుగా
ఉంది. స్థానికంగా పసిడి ధర పెరగడమే ఇందుకు కారణమని నివేదిక పేర్కొంటోంది. 2017 ఏప్రిల్‌-జూన్‌ తైమ్రాసికంతో పోలిస్తే 2018 ఏప్రిల్‌-జూన్‌ తైమ్రాసికంలో భారత్‌లో బంగారం డిమాండ్‌ 8శాతం తగ్గింది. గతేడాది వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జీఎస్‌టీ కంటే ముందే చాలా మంది పసిడి కొనుగోలు చేశారు’ అని డబ్ల్యూజీసీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సోమసుందరం తెలిపారు. అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌తో ఈ తైమ్రాసికం ఆరంభంలో కొనుగోళ్లు ఉత్సాహంగానే సాగినప్పటికీ ఆ తర్వాత అధికమాసం ప్రభావంతో డిమాండ్‌ తగ్గిందని ఆయన పేర్కొన్నారు. దీనికి తోడు ధరల పెరుగుదల కూడా బులియన్‌ మార్కెట్‌ను బలహీనపర్చిందని చెప్పారు. అయితే 2018 ద్వితీయార్థంలో పసిడికి డిమాండ్‌ పెరిగే అవకాశాలున్నాయని సోమసుందరం చెబుతున్నారు. వర్షాలు సానుకూలంగా ఉండటం, పండగ సీజన్‌ రానున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరుగుతాయని అంటున్నారు.