పాకిస్తాన్ బాలికకు పునర్జన్మనిచ్చిన ముంబైవాసులు
ముంబై, తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ పాకిస్తానీ బాలికకు ముంబై వాసులు ఆర్థిక సహాయం అందించి పునర్జన్మ ప్రసాదించారు. పాకిస్తాన్ మాజీ మంత్రి రాసిన ఓ పుస్తకావిష్కరణకు నిరసనగా ఒకప్పటి బీజేపీ సిద్ధాంతకర్త కులకర్ణిపై శివసేన కార్యకర్తలు నల్లరంగు గుప్పించిన రోజే ఆ బాలిక తన తల్లితో కలిసి భారతీయులు, ముఖ్యంగా ముంబై వాసుల ప్రేమానురాగాలను గుండెల నిండా నింపుకుని కరాచీకి బయలుదేరింది.
కరాచీకి చెందిన 15 ఏళ్ల బాలిక సబా తారిఖ్ అహ్మద్ కొంతకాలంగా విల్సన్స్ వ్యాధితో బాధపడుతోంది. శరీరంలో రాగి మలినాలు పేరుకుపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కుమార్తెను ఎలాగైనా రక్షించుకోవాలనే ఉద్దేశంతో ఆమె తల్లి నజియా.. సబాను తీసుకుని ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రికి తీసుకొచ్చింది. అయితే చికిత్స కోసం లక్షలాది రూపాయలు అవసరం అవుతాయని తెలిసి నివ్వెరపోయింది. విషయం తెలిసిన ముంబైకి చెందిన స్వచ్ఛంద సంస్థ బ్లూబెల్స్ ముంబైవాసుల నుంచి 7 లక్షల రూపాయలు సేకరించి సబా చికిత్స కోసం అందించింది. అవి వైద్యానికి ఎంతమాత్రమూ సరిపోకపోవడంతో అమెరికన్ ఎన్జీవో సంస్థ రాచల్, డ్రూకాట్జ్ ఫౌండేషన్‌కు సబా పరిస్థితి వివరించి మరో 4లక్షల రూపాయలు సేకరించి సబాకు అందించింది. అలాగే లండన్‌కు చెందిన మరో స్వచ్ఛంద సంస్థ 4 లక్షల రూపాయల విలువైన మందులు అందిస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం సబా కోలుకుంటున్నట్టు జస్‌లోక్ ఆస్పత్రి వైద్యుడు నగ్రాల్ తెలిపారు. సబా శరీరంలో ఉన్న రాగి విషపదార్థాలను తొలగించేందుకు క్యాప్సూల్స్ ఇస్తున్నామని, అయితే ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవన్నారు. ఈ క్యాప్సూల్స్ భారత్‌లో తయారు కావని వంద క్యాప్సూల్స్ 84 వేల రూపాయలని వివరించారు. ప్రస్తుతం సబాకు రోజుకు రెండు చొప్పున ఇస్తున్నట్టు నగ్రాల్ పేర్కొన్నారు. బాలిక సబా బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు బిగ్ ఫ్యాన్ అని, ఆమె కోరిక తీర్చేందుకు సల్మాన్‌ఖాన్ థీమ్ రెస్టారెంట్‌కు తీసుకెళ్లినట్టు డాక్టర్ నగ్రాల్ తెలిపారు.
ప్రస్తుతం బాలిక కోలుకుంటోందని, ఆమె ఆరోగ్యానికి వచ్చిన ముప్పేమీ లేదని వైద్యులు తెలిపారు. సబా తల్లి నజియా మాట్లాడుతూ తాను ముంబై వెళ్లడానికి సిద్ధమైనప్పుడు తమవారు తనను వారించారని, భారత్‌లో పరిస్థితులు అంత మంచిగా ఉండవని హెచ్చరించారని తెలిపారు. అయితే ఇక్కడకొచ్చిన తర్వాత భారతీయుల ప్రేమాభిమానాలు చూసి చలించిపోయానని చెమర్చిన కళ్లతో అన్నారు. ముంబై వాసులు పంచిన ప్రేమను తను, తన కుమార్తె సబా ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.