పాక్‌లో కొండచరియలు విరిగిపడి 13 మంది మృతి
హైదరాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీలో మంగళవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో కరాచీ దక్షిణ తీర ప్రాంతంలోని గుస్తాన్-ఈ-జౌహార్ ప్రాంతంలోని గుడారాలు కూలిపోయి 13 మంది మృతిచెందారు. స్థానికులు, సహాయక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 13 మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలున్నట్లు గుర్తించారు. శిధిలాల్లో మరో ముగ్గురు చిక్కుకున్నట్లు సిబ్బంది భావిస్తున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని మూడు రోజుల క్రితం ఈ ప్రాంతంలో గుడారం ఏర్పాటుచేసుకుని నివసిస్తున్నారని కరాచి కమిషనర్ షోయబ్ సిద్ధిఖి తెలిపారు. వీరంతా బతుకుతెరువు కోసం పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చినవారని పేర్కొన్నారు. మృతదేహాలని స్థానిక జిన్నా ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. సంఘటన ప్రకృతి వైపరీత్యమా లేక ఎవరైనా కుట్రపన్ని చేసిందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.