పాత విధానాన్నే కొనసాగిస్తాం
ఫీజు రీయింబర్స్మెంట్ పై బొత్స స్పష్టీకరణ
ధర్మాన కమిటీ నివేదికలో కొత్త విషయాలేమీ లేవు
హైదరాబాద్, ఆగస్టు 8 : బోధన ఫీజుల చెల్లింపుల విషయంలో బిసి విద్యార్థులకు అన్యాయం జరగనీయబోమని పిసీసీ అధ్యక్షుడు, రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఫీజు రీయింబర్ ్సమెంట్ విషయంలో పాత విధానాన్నే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచిస్తుందని చెప్పారు. బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్షలోపు వార్షిక ఆదాయం ఉన్న అన్ని కుటుంబాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయం, ప్రస్తుత ప్రభుత్వానికి గుదిబండగా మారిందని, కోట్లాది రూపాయల ఫీజులు చెల్లిస్తున్నా సరైన ఫలితాలు రావడం లేదని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడడం వాస్తవమేనని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికి బీసీ విద్యార్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఏకీకృత ఫీజు విధానంపై 135 కాలేజీలు అభ్యంతరం వ్యక్తం చేసాయని ఆయన చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పారు. సమష్టి కృషి వల్ల ప్రస్తుతానికి గ్యాస్ సమస్య పరిష్కరమయిందని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై భవిష్యత్తులో కూడా అంతా.. ఇదే విధమైన సమైక్య స్ఫూర్తిని కొనసాగించాలని బొత్స అభిలాషించారు. ముఖ్యమంత్రి పదవి గురించి ప్రస్థావన వచ్చినప్పుడు కిరణ్ కుమార్రెడ్డి తలరాత బాగుండడం వల్లే మంత్రి కాకపోయినా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టగలిగారని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ పట్ల విధేయత కాంగ్రెస్ విధానాలపట్ల విశ్వాసం ఉన్నవారే నిజమైన కార్యకర్తలని ఆయన అన్నారు.