పారిశుద్య కార్మికులపై వేలాడుతున్న 279 జీవో కత్తి
అమలుకే మున్సిపాలిటీల మొగ్గు
ఆందోళనలో కార్మికులు
అమరావతి,జూలై17(జనం సాక్షి): పారిశుద్య కార్మికులపై 279 జీవో కత్తి వేలాడుతోంది. దీనిని రద్దు చేయాలని ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేటీకరనలో భాగంగా ఇది అమలు చేయకతప్పదన్న భావన కలుగుతోంది. 279 జీఓ అమలు చేస్తే కార్మికులను కాంట్రాక్టర్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కార్మికులకు ఉద్యోగ భరోసా కూడా ఉండదు. అమలు చేయాలని చూస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ప్రజారోగ్యంలో కీలకమైన పారిశుద్ధ్యం విభాగాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 279 గెజిట్ ఆర్డర్ జారీ చేసిన నేపథ్యంలో అమలుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో అమలుకురంగం సిద్దం అయ్యింది. ఎప్పటికైనా పర్మినెంట్ అవుతాం.. తాము పడుతున్న కష్టాలు తీరుతాయి.. అనే ఆశతో 15 ఏళ్లకు పైగా పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం ఒంటెద్దు పోకడతో కార్మికులను ప్రైవేట్ పరం చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై కార్మికులు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం మొండి వైఖరితో కార్మికుల భవిష్యత్‌ను పణంగా పెట్టడానికే సిద్ధపడుతోంది. ఈ జీవో ఆధారంగా నెల్లూరు నగరాన్ని మూడు ప్యాకేజీలుగా విభజించి ప్రణాళిక రూపొందించారు. మరి కొద్ది రోజుల్లో ప్రయోగాత్మకంగా ఒక ప్యాకేజీని అమలు చేయనున్నారు. అందులో భాగంగా ఇప్పటికే పారిశుద్ధ్య కార్మిక సొసైటీ అధ్యక్షులతో కార్పొరేషన్ కమిషనర్ చర్చలు జరుపుతున్నారు. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 877 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. 77 సొసైటీల కింద కార్మికులు ఉన్నారు. కార్పొరేషన్‌లోని 54 డివిజన్లను 20 శానిటరీ డివిజన్లుగా విభజించి పనులు చేస్తున్నారు. మూడున్నర ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికులను సొసైటీల కింద కాకుండా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ కింద పనిచేసేలా ప్రభుత్వం 279 జీఓను విడుదల చేసి నిర్ణయం తీసుకుంది. అయితే ప్రైవేట్ వ్యక్తులు జీతాలు సరిగా ఇవ్వకపోవడం, పని ఒత్తిడి పెంచి ఇబ్బందులు పెడతారని, భరోసా ఉండదని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కార్మికుల కుటుంబ భద్రతను ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా జీఓ అమలు చేసేందుకు ముందడుగులు వేస్తుంది. సొసైటీల కింద పనిచేస్తున్న కార్మికుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కమిషనర్ అలీంబాషా సొసైటీ అధ్యక్షులతో వారం రోజులుగా విడతల వారీగా సమావేశాలు జరిపారు. కార్మికులకు 279 జీఓ
కారణంగా వచ్చే లాభాలను వివరించాలని చెప్పినట్లు తెలుస్తుంది. జీఓ అమలు కావడం కచ్చితమని
అందరూ సహకరించాలని కోరారు. అయితే సొసైటీ అధ్యక్షులు మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని, పోరాటం ఉధృతం చేస్తామని తేల్చి చెప్పినట్లు సమాచారం.