పారిశ్రామిక హబ్‌గా ఎపి అభివృద్ది
చంద్రబాబు కృషితో పరిశ్రమల వెల్లువ
సరిశ్రలమ కేంద్రానికి శంకుస్థాపన చేసిన మంత్రులు
గుంటూరు,జూలై26(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ది చేసేందుకు సిఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రులు అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని టీడీపీ మంత్రులు తెలిపారు. గురువారం జిల్లాలో పరిశ్రమల కేంద్రం నూతన భవనానికి మంత్రులు అమర్‌నాథ్‌రెడ్డి , నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ 9 నెలల్లో పరిశ్రమల భవనాన్ని పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు దూరదృష్టి వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో తొలిస్థానంలో నిలబడ్డామన్నారు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు 10 పాలసీలు రూపొందించామని, పరిశ్రమల ఏర్పాటుకు 21 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. నాలుగేళ్లలో 10లక్షలమందికి ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎపీలో పరిశ్రమలు లేకపోవడంతో వృద్ధిరేటులో వెనుకబడ్డామని మరో మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సీఎం చంద్రబాబు అనేక దేశాల్లో పర్యటించి ఏపీకి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారన్నారు. విశాఖలో సీఐఐ సదస్సును కొందరు అడ్డుకునేందుకు యత్నించారని మండిపడ్డారు. ఐఏఎస్ ఆఫీసర్లను జైలుకు పంపిన ఘనత జగన్‌దే అని మంత్రి ఆనందబాబు విమర్శించారు. కియాలాంటి పరిశ్రమలు ఏపీకి తీసుకురావడం టీడీపీ గొప్పతనమని మంత్రి ప్రతిపాటి పుల్లారావు అన్నారు.