పార్టీ బలోపేతంపై బిజెపి దృష్టి

వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు

విశాఖపట్టణం,నవంబర్‌23(జ‌నంసాక్షి): టిడిపితో పొత్తు వదులుకోవడంతో ఇక్కడ బలపడాలన్న ఆకాంక్ష బిజెపిలో బలంగా ఉంది. పొత్తుల వ్యవహారం పక్కన పెడితే పార్టీకి సంబంధించినంతవరకు చేస్తున్న, చేపడుతున్న కార్యక్రమాలు ఇందులో భాగంగానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో తన పట్టును పెంచుకోవడానికి ఉత్తరాంధ్రపై ఆ పార్టీ దృష్టి కేంద్రీకరించింది. ఉత్తరాంధ్రలో బీజేపీకి బలమైన క్యాడర్‌ ఉండడమే కాకుండా ఆ పార్టీకి ఓ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉన్నారు. దీంతో ఉత్తరాంధ్రలో ఇంకా బలపడాలని కమలనాధులు భావిస్తున్నారు. దీని ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో పాటు మరికొన్ని ఎమ్మెల్యే స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. బీజేపీ రోజురోజుకు రాష్ట్రంలో బలం పెంచుకోవడం కోసం వలసలను పెంచే పనిలో ఉన్నారు. పురందేశ్వరి, హరిబాబు తదితరులు ఈ బాధ్యతను నిర్వహించే పనిలో పడ్డారు. ఇతర పార్టీల నుంచి బిజెపిలోకి ఎక్కువ మందిని చేర్చుకునేలా ప్లాన చేస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో బలపడటంతో పాటుగా బూత్‌ లెవల్‌ లో కూడా బలపడాలనేదీ బీజేపీ అలోచన. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని ఊవిళ్లూరుతోంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో తమ బలం పెంచుకోవాలని కసరత్తులు చేస్తుంది. ఇందులో భాగంగా ఇటీవల మళ్లీ వలసలను ప్రోత్సిస్తున్నారు. దీనికితోడు అధికరా పార్టీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.