పార్టీ వ్యవహారాలకు దూరంగా కాంగ్రెస్‌ సీనియర్లు

చురుకుగా పాల్గొనలేకపోతున్న వైనం

ఎన్నికల సమయంలోనూ కనిపించని చైతన్యం

విజయవాడ,సెప్టెంబర్‌14(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ ద్వారా పదవులు అనుభవించి, అధికారంలో ఉండగా అందలం ఎక్కిన నేతలు ఇప్పుడు కనిపించకుండా సొతం వ్యవహారాలు చూసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరో ఆరు నెల్లో ఎన్నికలురానున్న నేపథ్యంలో వీరంతా ఇంకా కలుగుల్లోనే ఉన్నారు. ప్రధానంగా ఎపిలో విభజన అనంతర పరిణామాలపై పోరాడాల్సిన సమయంలో బయటకు రాకుండా సొంత వ్యవహారాల్లో బిజీగా ఉండడంపై కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనికితోడు అనేకమంది ఆయా పార్టీల్లో చేరిపోయారు. ఉన్నకొద్దిపాటి వారు కూడా తెరవెనక్కి పోయారు. విభజన పాపం వెంటాతుండడంతో వారు బయటకు రావడం లేదు. వచ్చినా విమర్శలను తట్టుకోలేకపోతున్నారు. ఎపిలో ఇక కాంగ్రెస్‌ అడుగంటిందనే ప్రచారం దీనితో బలపడింది. ఉమెన్‌ చాందీ వచ్చిన తరవాత కొంత ఉత్సాహం కనిపించినా ఇంకా అనేకులు తెరచాటునే ఉన్నారు. దీంతో అనేకమంది నేతలు వైకాపా వైపు చూస్తున్నారు. మరోవైపు ప్రజల్లోకి వెల్లి గట్టిగా పోరాడే నేతలు లేరు. తెలంగాణలో అన్ని జిల్లాల్లో నేతలు గట్టిగా పోరాడుతున్నారు. అదే పరిస్థితి ఎపిలో కనిపించడం లేదు. కాంగ్రెస్‌కు మంచి పరిస్థితులు వచ్చే అవకాశాలు లేవన్న భావనలో నేతలు ఉన్నారు. ప్రధానంగా చిరంజీవి లాంటి వారు రాజ్యసభను పొంది మంత్రి పదవి అనుభవించి, సినిమాల పేరుతో కాంగ్రెస్‌ కార్యక్రామలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస పార్టీ అంతా ఖాళీ అవుతున్నా పట్టించు కోవడంలేదని, కార్యకర్తలో మనోధైర్యం నింపే ప్రయత్నం ఆయన చేయడం లేదన్న విమర్శలను సొంత పార్టీ నేతల నుంచే ఎదుర్కొంటున్నారు. తూర్పులో విశ్వరూప్‌, విశాఖజిల్లా నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్‌ ఇలా పార్టీలో ఇప్పటికీ కొనసాగుతున్న సీనియర్‌

నేతలు మాత్రం ఇప్పుడు పార్టీ బలోపేతం దిశగా దృష్టిసారిం చకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏపి పిసిసి ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, కాంగ్రెస్‌కు స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సైతం నేడు పార్టీకి అంటి అంటనట్లు ఉన్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన తన సైరా సినిమా నిర్మాణం పనుల్లో బిజీగా

ఉన్నారు. ఇటీవల కాపు ఉద్యమానికి మద్దతు పలకడం, టిడిపి సర్కార్‌పై తీవ్రంగా మండిపడటం వంటి ప్రకటనలకు పరిమితం అయ్యారు. కడపజిల్లాకు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు సి.రామచంద్రయ్య, తులసిరెడ్డి వంటి నేతలు ఇప్పుడిప్పుడే క్రీయాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొనడం లేదన్న విమర్శలువచ్చాయి. అయితే ప్రస్తుతం ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రఘువీరారెడ్డితోపాటు స్వతహాగా తాను కూడా కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. రైతుల బాధలను తెలుసుకొనేందుకు ఆయన ప్రత్యేక పర్యటనలు చేస్తున్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు శైలజానాథ్‌ సైతం పార్టీ కార్యక్రమాలలో అనుకొన్నమేర ఉత్సాహంతో పాల్గొనడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కడపజిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్‌, మాజీ మంత్రులు డి.ఎల్‌.రవీంధ్రారెడ్డి, అహ్మదుల్లా సైతం కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమాలు పాల్గొనడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి నుంచి వట్టి వసంత్‌కుమార్‌ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పళ్లంరాజు వంటి నేతలు అప్పుడప్పడు కనిపిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు కొందరు ఇప్పుడిప్పుడే పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమాలకు సిద్దమవుతున్నా ఇంకా కొంతమంది సీనియర్లు మాత్రం ముందుకు రావడం లేదు.మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి కూడా పార్టీ బలోపేత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా మౌనంగా ఉండిపోతున్నారని అక్కడి జిల్లా కాంగ్రెస్‌ శ్రేణులు వాసోతున్నాయి. నెల్లూరు జిల్లాలో పేరున్న కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత టి.సుబ్బిరామిరెడ్డి ఆ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం కోసం దృష్టిసారించడం లేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. గుంటూరుజిల్లాలో కాంగ్రెస్‌కు ఏకైక పెద్ద దిక్కుగా మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి ఉన్నారు. ఇలా ఎందరున్నా అంతా అంటీముట్టనట్లుగా ఉన్నారు. మాజీ సిఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి మళ్లీ పార్టీలో చేరినా ఇంతవరకు ఎలాంటి కార్యాచరణ చేయలేదు.

తాజావార్తలు