పార్లమెంట్‌లో చేసిన చట్టానికే దిక్కులేదు
– కేంద్రం చెప్పేదొకటి.. చేసేదొకటి
– కాపుల రిజర్వేషన్‌పై జగన్ ద్వందవైఖరిని అవలంభిస్తున్నాడు
– కేంద్రంపై ఒత్తిడి తేకుండా నా పరిధిలో లేదని జగన్ ఎలా చెబుతారు
– కేంద్రం రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లు కల్పించవచ్చు
– విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి యనమల
అమరావతి, జులై31(జనం సాక్షి ) : పార్లమెంట్‌లో చేసిన చట్టానికే దిక్కు లేకపోతే ఎవరికి చెప్పుకోవాలని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన అమరావతిలో మాట్లాడారు. కేంద్రం అటు సుప్రీం కోర్టును, ఇటు పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. 10 వ షెడ్యూల్‌లోని సంస్థలపై సుప్రీం ఆదేశాలు అమలు కావడం లేదన్న యనమల.. ఈ అంశంలో కేంద్రంపై మళ్లీ అఫిడవిట్ వేస్తామని చెప్పారు. రైల్వే జోన్ పై కూడా కేంద్రం చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి అని అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీతో వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కలిసి సాగుతున్నారని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్ల అంశంలో జగన్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని యనమల విమర్శించారు. అప్పుడు రిజర్వేషన్ కావాలన్న జగన్.. ఇప్పుడు సాధ్యం కాదంటున్నారని అన్నారు. జగన్ వైఖరిని ఆ వర్గం ప్రజలు గుర్తించారని, తగిన సమయంలో బదులిస్తారని చెప్పారు. కేంద్రం పై ఒత్తిడి తేకుండా ‘నా పరిధిలో లేదు’ అని జగన్ ఎలా చెబుతారని యనమల ప్రశ్నించారు. రాజ్యాంగంలో ఇంపాజిబుల్ అనే పదం లేదని.. కేంద్రం రాజ్యాంగాన్ని సవరించి రిజర్వేషన్లు కల్పించవచ్చని యనమల అన్నారు. కాపు రిజర్వేషన్లకు వైసీపీ వ్యతిరేకం కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు కానీ.. జగన్ ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఒక్కో కులాన్ని జగన్ మోసం చేసుకుంటూ వెళ్తున్నారని యనమల అన్నారు. ‘కాపు రిజర్వేషన్లపై మేం పీఠాపురంలో హావిూ ఇస్తే.. రిజర్వేషన్లు ఇవ్వలేమని ఆ పక్క నియోజకవర్గంలోనే జగన్ ప్రకటన చేశారని యనమల అన్నారు. ఒక్కో కులాన్ని ఆయన మోసం చేసుకుంటూ వెళ్తున్నారని యనమల విమర్శించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టానికి సంబంధించిన జరుగుతున్న పరిణామాలపై జగన్, పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎస్సీ వర్గానికి చెందిన మంత్రులు, బీజేపీ ఎంపీలు బయటకు వచ్చే ఆలోచనలో ఉన్నారన్న యనమల.. బీజేపీ ఎంపీలు కూడా మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు.