పాలతో రైతుల స్నానం …ధరల కోసం రైతుల నిరసనలు

రెండోరోజుకు చేరుకున్న మహా ఆందోళన

ముంబై,జూలై17(జ‌నం సాక్షి): పాలకు కనీస మద్దతు ధరల లేకపోవడంతో రెండు రోజులుగా మహారాష్ట్ర రైతులు నిరసనలు చేస్తుండగా ఓ రైతు పాలతో స్ననాం చేసి నిరసన తీవ్ర చేశాడు. మరోవైపు ట్యాంకర్లలోని వేల లీటర్ల పాలను నేలపాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం (జూలై-17) పాలతోనే స్నానాలు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు రైతులు. ఇందులో భాగంగానే మగల్వేదా పట్టణానికి చెందిన సాగర్‌ లేందావే అనే రైతు.. 35 లీటర్ల పాలతో స్నానం చేసి రైతులకు మద్దతు తెలిపారు. అంతే కాకుండా తన పశువులకు కూడా పాలతోనే స్నానం చేయించాడు. పాల సేకరణ ధర పెంచాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్ర రైతులు చేపట్టిన ఆందోళన రెండో రోజుకు చేరింది. లీటర్‌కు రూ. 5లు సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా స్వాభిమాని శేట్కారి సంఘటన అధినేత రాజు శెట్టి ఆధ్వర్యంలో పాల రైతులందరూ.. పుణె, నాసిక్‌, అహ్మద్‌నగర్‌, బుల్దానా, జలగావ్‌ తదితర జిల్లాల్లో పాల ట్యాంకర్లను అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే పాల రైతుల డిమాండ్‌ ను ఆమోదించేందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నిరాకరిస్తున్నారు. ప్రభుత్వ తమ డిమాండ్లను ఒప్పుకునేవరకు పాలను అమ్మే ప్రసక్తే లేదంటున్నారు అన్నదాతలు.