పాలనలో భాగంగానే ..  కేంద్రం నివేదికలు అడుగుతుంది


– దానిని రాజకీయ కోణంతో ముడిపెట్టడం సరికాదు
– విలేకరుల సమావేశంలో బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి
గుంటూరు, నవంబర్‌23(జ‌నంసాక్షి) : రాజకీయాల కారణంగా రాష్ట్రం నష్టపోతుంది… దీనిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడుతూ… పాలనలో భాగంగానే రాష్ట్ర అధికారులను కేంద్రం నివేదికలు అడుగుతోందని దీనిని రాజకీయ కోణంతో ముడిపెట్టడం సరికాదని అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తుందన్నారు. సీఎస్‌లుగా పనిచేసిన వారు సైతం టీడీపీ ప్రభుత్వ అవినీతిని బయటపెడుతున్నారని విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని ఎవరైనా గౌరవించాల్సిందేనని, ఆంధప్రదేశ్‌ అందుకు మినహాయింపు కాదన్నారు. సీబీఐని వద్దన్నట్లే కోర్టులు, ఐపీఎస్‌, ఐఏఎస్‌లను సొంతంగా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ప్రతిపక్షనేతపై కేసులు పెట్టినప్పుడు సీబీఐ మంచిదై పోయిందని విష్ణువర్దన్‌రెడ్డి అన్నారు. ఆంధప్రదేశ్‌ ప్రత్యేక దేశం కాదని, వ్యవస్థలతో అడుకోవటం వల్ల సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుందని అన్నారు. రాష్ట్రంలో నయా రాచరిక వ్యవస్థను తయారు చేయాలనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు ఏపీని తన సొంత రాజ్యంగాలా భావిస్తున్నాడని, ఆయన ఏది చెబితే అది జరిగిపోవాలనే ధోరణితో దుర్మార్గంగా ముందుకెళ్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులకు అనుగుణంగా నడుచుకోవాలని, అలాకాదని వారి హక్కులను కాలరాసేలా నడిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారని విష్ణువర్దన్‌రెడ్డి హెచ్చరించారు. ఏపీకి అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కానీ చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో ఓటమినుంచి
తప్పించుకొనేందుకు కేంద్రాన్ని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని, గుణపాఠం తప్పదని హెచ్చరించారు.