పాలనాపరమైన లోపాలే ప్రజలకు శాపం

ప్రజల డబ్బుతో జల్సాలు చేస్తున్న నేతలు

హావిూలను మరుగున పరుస్తున్న పార్టీలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఎన్నికల హడావిడిలో అన్ని పార్టీలు పరస్పర ఆరోపణలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి తప్ప ప్రజలకిచ్చిన వాగ్దానాలను పట్టించుకోవడం లేదు. దాదాపు నాలుగున్నరేళ్ల కాలం పూర్తి కావచ్చినా, పాలకులు ఎవరికివారు ప్రజలకిచ్చిన హావిూలు నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా బిజెపి, టిఆర్‌ఎస్‌లు తామంతా ఘనకార్యం చేశామనే ప్రగల్భాలకు పోతున్నారు. దేశం మొత్తం మార్చేశామిన, బిజెపి నేతలు చెప్పుకుంటుంటే, తాము తెలంగాణను ప్రగతిపథంలో ముందుంచామని అధికార టిఆర్‌ఎస్‌ ఢంకాబజాయిస్తోంది. ఉత్తరాది ఎన్నికల్లో అధికార బిజెపి ఇంకా కాంగ్రెస్‌ బూచిచూపి ఓట్లను దండుకోవాలని చూస్తోంది. కేంద్ర రాష్ట్రాల్లో ఏ మేరకు హావిూలు అమలు చేశారన్నది ప్రజల స్పందనను బట్టి గమనించాలి. అంతేగానీ ఎవరికి వారు తామంతా బ్రహ్మాండంగా పనిచేశామంటే నమ్మడానికి ప్రజలు సిద్దంగా లేరు. ప్రధానంగా కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం వచ్చిన తరవాత సామాన్యుల కలలు సాకారమయ్యాయా..ఇచ్చిన హావిూలు నెరవేరాయా అన్నది చూసుకోవాలి. మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికలు జరుగుతన్న వేళ ఐదు రాష్ట్రాల్లో ప్రజలకు ఒనగూరిందేమిటన్నది ప్రజలంతా గతాన్ని నెమరేసుకుని సాగాల్సి ఉంది. స్వాంత్య్రం

సిద్దించి ఏడు దశాబ్దాలు దాటినా ఇంకా ఆకలిదప్పులు తప్పడం లేదు. అత్యాచారాలు పెరిగాయి. మహిళలకు రక్షణ లేకుండా పోయింది. చదువుకుందామంటే అది ఖరీదైన వస్తువుగా మారింది. చదువులను కొనలేని దుస్థితి ఏర్పడింది. ఇలాంటి సమస్యలను పరిష్కరించడమే ముఖ్యం గానీ తాము అనుకున్న రీతిలో పనులు చేస్తూ అవే ప్రజా సమస్యల పరిష్కారం అని తలపోసేలా పాలకులు వ్యవహరిస్తున్నారు. అధికారంలోకి రాగానే మరో ఐదేళ్లు గద్దెపై ఉండడమెలా అన్న ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేయడం వల్లనే భారత్‌ ఇన్నేళ్ల తరవాత కూడా ఇంకా దారిద్యం, నిరక్షరాస్యత, వసతుల కొరత, ఆహార ధాన్యాల కొరతతో అలమటిస్తోంది. దేశంలో ఇప్పటికీ సరైన ప్రజారోగ్య వ్యవస్థ లేదు.వ్యవసాయ రంగం కుంగి కృషించిపోతోంది. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఆహారధాన్యాలకు మద్దతు ధరలు అందడం లేదు. విద్య మిధ్యగా మారింది. ఉద్యోగాల కల్పన అంతంత మాత్రంగానే ఉంది. ప్రజలు స్వేచ్ఛగా బతికేలా, ఆర్థికంగా ఎదిగేలా, పనిచేసుకుంటే పనిదొరికేలా పాలన చేయాలి. కేవలం వాగాడంబ రాలతో ఎంతోకాలం ప్రజలను మభ్యపెట్టలేమని గుర్తించాలి. తాము చేస్తున్న పనుల వల్ల క్షేత్రస్థాయిలో మార్పులు వచ్చాయా లేదా అన్నది పాలకులు గమనించడం లేదు. విమర్శలను సానుకూల దృక్పథంతో తీసుకుని ముందుకు సాగడం లేదు. ఇంతకాలం ఎక్కడ లోపం ఉందో గుర్తించి అవలోకనం చేసుకోవాలి.

రాజకీయాలను పక్కన పెట్టి సానుకూలంగా ఆలోచన చేసి ముందుకు సాగాల్సి ఉంది. రాజకీయ దృక్కోణంలో కాకుండా అభివృద్ది కోణంలో ఆలోచన చేయాల్సిన విషయాన్ని పాలకులు వంటబట్టించు కోవాల్సి ఉంది. ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గవర్నర్‌ వ్యవస్థ ఇలా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం బదులు నానాటికి దిగజారుస్తున్నాయి. ప్రజల డబ్బు నీళ్లప్రాయంగా ఖర్చవుతోంది. ముక్కుపిండి వసూలు చేస్తున్న పన్నులను పాలకుల విసలాలకు ఖర్చు చేసుకుంటున్నారు. ఎన్నికలలో డబ్బు అవసరం లేకుండా సంస్కరణలు తీసుకురాకుండా ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేదు. రాజకీయ పార్టీల ప్రధాన లక్ష్యం అధికారమే కనుక,ఆ అధికారం కోసం ఎంతకైనా తెగబడతాయని నిరూపితం అయ్యింది. అధికారమే పరమావధిగా ఇలాంటి ప్రజాస్వామ్యం కొనసాగితే మరో 72 ఏళ్లయినా మన భారత్‌ తలరాత మారదు. రాజకీయ సంస్కరణలు రావాలి. పాలకుల ఆలోచనాతీరులో మార్పు రావాలి. ప్రజాధనం వృధా ఖర్చులకు కళ్లెం పడాలి. అప్పుడే ప్రజలకు స్వాతంత్య్ర ఫలం దక్కుతుంది. అందుకు అనుగుణంగా మనమంతా సంస్కరణలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆనాటి పాలకుల దూరదృష్టి లోపం కారణంగా మనకు వారసత్వంగా వచ్చిన సకల అవలక్షణాలు ప్రజలను ఇంకా దరిద్రంలోనే ముంచెత్తుతున్న వేళ పాలకులకు గట్టిగా బుద్ది చెప్పేలా ప్రజలు తమ ఓటును వినియోగించుకోవాలి. గతాన్ని నెమరేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. నోట్ల రద్దు తరవాత అనేక కష్టాలు పడుతున్నారు. మోడీ రాకతో ప్రజల్లో చిగురించిన ఆశలు వమ్మయ్యాయి. జిఎస్టీతో ప్రజలు మరింతగా కుంగిపోతున్నారు. జిఎస్టీని సమర్థించిన ఆయా రాష్ట్రాల సిఎంలే ఇప్పుడు దాని బారినుంచి రక్షించాలని కోరుకుంటున్నారు. వివిధ రంగాలపై అదిచూపిస్తున్న చెడు ప్రభావాన్ని విశ్లేషించు కోవాల్సిన మోడీ ప్రభుత్వం మొడిగా వ్యవహరిస్తోందే తప్ప ప్రజల కోణంలో ఆలోచించడం లేదు. విద్యావైద్య రంగం ఎందుకు వెనకబడి ఉందో తెలుసుకోవాలి. అన్నిరంగాల్లో మనం ముందంజ వేయాల్సిన దశలో ఇంకా దిగుబడులపై ఆధారపడుతూ ఎగుమతుల విషయంలో లక్ష్యం లేకుండా సాగుతున్నాం. ఆహారధాన్యాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఎందుకు అదేపనిగా దిగుమతి చేసుకుంటున్నామో ఆలోచన చేయాలి. మనం చేపట్టిన సంస్కరణలు ఫలితాలు ఇవ్వడం లేదన్న విషయాన్ని గుర్తించడం లేదు. నిజానికి దేశంలో నల్లధనం, అవినీతి పోవాలంటే రాజకీయ పార్టీల నుంచే

ప్రక్షాళన మొదలవ్వాలి. నల్లధనం రూపంలో రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకుని ఓటర్లను కొనుగోలు చేయడానికి వాడుతున్నాయి. ఎన్నికలు అయ్యాక తగిన మెజారిటీ సమకూరని సందర్భాలలో ఎమ్మెల్యేలు లేదా ఎంపీల బేరసారాల కోసం ఈ నల్లధనాన్నే వాడుతున్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలలో అత్యధిక భాగం నల్ల డబ్బు రూపంలోనే ఉంటోంది. ఈ పరిస్థితిని నివారించ కుండా ఎన్ని సంస్కరణలు చేసినా ఫలితం ఉండదు. ఆహారధన్యాలను ఇన్నేళ్ల వైఫల్యాలపై పాలకులు ఆత్మపరిశీలన చేసుకునే సమయమిదే.