పాలమూరు పరిధిని విస్తరణకు ఎన్నికల అడ్డంకి

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తరవాతనే ప్రతిపాదనలకు మోక్షం

కొత్త మున్సిపాలిటీలపై అప్పుడే కసరత్తు?

మహబూబ్‌నగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల పరిధి పెంచడం, వాటి పరిధి మేరకు అవసరమైతే కార్పొరేషన్‌గా ఏర్పాటు చేసే అంశాలపై జిల్లా యంత్రాంగం గతంలోనే ప్రతిపాదనలు తయారు చేసింది. స్థానికంగా ప్రజల అభిప్రాయాలు, పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు

చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఉన్న మున్సిపాలిటీలను ఉన్నతీకరించే చేసే అవకాశాలను సైతం పరిశీలిస్తున్నారు. అయితే ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదన ఆగిపోయింది. ఎన్నికల తరవాత మళ్లీ దీనిని పట్టాలకు ఎక్కించే ప్రయత్నం చేయవచ్చు. 2011 జనాభా లెక్కలు, 2014లో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కొత్త

మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు పక్రియ మొదలుపెట్టారు. 15 వేలపైబడి జనాభా ఉన్న పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించడంతో.. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు, జనాభా లెక్కలు, సమగ్ర సర్వే వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. కొత్తగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీల ఏర్పాటు, పాత మున్సిపాలిటీల విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని ప్రకారం జిల్లాలో రెండు మున్సిపాలి టీలు కొత్తగా ఏర్పాటయ్యే అవకాశం ఉంది. జిల్లాలోని మక్తల్‌, కోస్గి పంచాయతీలు నగర పంచాయతీలుగా మారనున్నాయి. ఇప్పటికే వీటి ప్రతిపాదనలు కూడా పంపించారు. విలీన గ్రామాల సమస్య లేకపోవడంతో ఈ రెండు పంచాయతీలకు మున్సిపాలిటీ ¬దా దక్కనుందని సమాచారం. దేవరకద్రను కూడా నగర పంచాయతీగా మార్చేందుకు అవకాశాలున్నాయి. శివారు గ్రామాలు విలీనం చేస్తే.. దేవరకద్రకు మున్సిపాలి టీ ¬దా రానున్నది. అదే విధంగా మద్దూరును కూడా నగర పంచాయతీగా మార్చే అంశాలను పరిశీలి స్తున్నారు. కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు, మున్సిపాలిటీని అప్‌గ్రేడ్‌ చేయడం వంటి అంశాలపై దాదాపు ప్రతిపాదనలు పూర్తి చేశారు. ఇప్పటి వరకు కోస్గి, మక్తల్‌కు క్లియరెన్స్‌ ఇచ్చామని, వాటికి మున్సిపాలిటీ ¬దా దక్కేందుకు అన్ని అవకాశాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌ నగర్‌ మున్సిపాలిటీ అప్‌గ్రేడ్‌ అయ్యే అవకాశాలపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అయితే కార్పొరేషన్‌ గా మార్చేందుకు ఎంత మేరకు అవకాశాలున్నాయనే విషయాలను పరిశీలిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు కార్పొరేషన్‌ ప్రతిపాదనలు కాకుండా.. అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చి.. పాలమూరును అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచన కూడా ఉంది. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌ను అర్బన్‌ డెవలప్‌ అథారిటీ పరిధిలోకి తీసుకుని రావాలంటూ ఇప్పటికే ప్రతిపాదనలు పంపించారు. అర్బన్‌ డెవలప్‌ అథారిటీలో చేరిస్తేనే, అక్రమ భూదందాలు ఆగుతాయని, అభివృద్ధికి అడుగులు పడుతాయని భావిస్తున్నారు. ప్రధానంగా మూడు నియోజక వర్గాలు కార్పొరేషన్‌లో విలీనం కావాల్సి ఉంటోంది. దీనిపై ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులతో చర్చించాల్సి ఉంది. మరోవైపు మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీని అర్బన్‌ డెవలప్‌ అథారిటీ పరిధిలోకి తేవడానికి సైతం ప్రతిపాదనలు పంపారు. హబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధి పెంచి కార్పొరేషన్‌గా విస్తరించే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా మూడు నియోజకవర్గాల మేరకు మహబూబ్‌నగర్‌లో విలీనం చేయాల్సి వస్తుందని ప్రభుత్వానికి నివేదించారు. అయితే దీనిపై అటు జడ్చర్ల, ఇటు దేవరకద్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న మహానగరాల ప్రకారం ఒకే కార్పొరేషన్‌ కింద మూడు నియోజకవర్గాలను చేర్చే అంశాలను పరిశీలించారు. ఈ లెక్కన దేవరకద్ర, జడ్చర్ల, భూత్పూరులను విలీనం చేసి మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ఫలితాల తరవాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ప్రతిపాదనలను పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అధికారులు ఎన్‌ఇనకల్లో బిజీగా ఉన్నారు. బహుశా జనవరి తరవాత దీనిపై దృష్టి పెట్టవచ్చని

అంటున్నారు.