పాస్‌వర్డ్ హ్యాకింగ్‌కు చెక్‌!

r7d1pjg6ఈ-మెయిల్, మొబైల్ ఫోన్ల పాస్‌వర్డ్ హ్యాకింగ్‌కు గురై ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు భవిష్యత్తులో భారీ ఊరట లభించనున్నది. ఇందుకోసం టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ పాస్‌వర్డ్ రహిత సేవలు అందించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నది. ఇప్పటికే చర్యలను ప్రారంభించినట్లు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. కంపెనీని ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్‌లీష్‌డ్ పేరుతో ముంబైలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. పాస్‌వర్డ్‌ తో అవసరం లేకుండా నేరుగా ఫేన్ రికగ్నైజేషన్‌తోపాటు ఇతర బయోమెట్రిక్ పద్ధతుల్లో యూజర్‌ను గుర్తుపట్టేలా టెక్నాలజీని అభివృది చేయనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే దేశీయంగా ఏర్పాటవుతున్న స్మార్ట్‌ సిటీల్లో పాలుపంచుకోనున్న నూతన పారిశ్రామికవేత్తలకు ఆర్థికంగా చేయుతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సత్య నాదెళ్ల చెప్పారు. ప్రస్తుతం భారత్‌లో స్మార్ట్‌ సిటీలతోపాటు స్టార్టప్‌లు, ఈ-కామర్స్‌ల ట్రెండ్ నడుస్తున్నదన్నారు. భారత్‌లో ఈ-కామర్స్ రంగం అధిక వృద్ధి నమోదు చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ.. ఇది ఊహించిన దానికంటే అధికంగా ఉందని, ఈ రంగంలో ప్రవేశించాలనుకోవడం లేదని, కానీ నాణ్యమైన సేవలు అందించే బాధ్యత ఆయా సంస్థలపై ఉందన్నారు. స్టార్టప్‌లను దృష్టిలో పెట్టుకొని క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులను మెరుగు పరచడానికి ఈ-కామర్స్ సంస్థలైన జస్ట్‌ డయల్, పేటీఎం, స్నాప్‌ డీల్‌లతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. ఈ మూడు సంస్థలతో కలిసి స్మార్ట్ సిటీలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంతోపాటు హెల్త్‌ కేర్, విద్య, వ్యవసాయ రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం పరిష్కరించేందుకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. స్మార్ట్‌ సిటీల్లో పాలుపంచుకోనున్న స్టార్టప్‌లకు వ్యక్తిగతంగా 1.20 లక్షల డాలర్లు లేక రూ.80 లక్షల వరకు రుణాన్ని అందించనున్నది. వచ్చే ఏడాది చివరికల్లా దాదాపు 50 స్మార్ట్‌ సిటీల్లో పనిచేసే 50 స్టార్టప్‌లతో భాగస్వాములమవుతామని ఆయన వెల్లడించారు.