పిల్లలకు అందుబాటులోకి టీకా
న్యూఢిల్లీ : దేశంలో కరోనాకు వ్యతిరేకంగా మరో టీకా అందుబాటులోకి రానున్నది. 12-18 సంవత్సరాల్లోపు పిల్లల కోసం బయోలాజికల్ ఈ కంపెనీ కార్బెవాక్స్ పేరుతో టీకాను రూపొందించగా.. అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది. దరఖాస్తుపై ఇవాళ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పిల్లలకు కొవిడ్ ఇమ్యునైజేషన్ డ్రైవ్ వేగవంతం చేయడంలో సహాయపడనున్నది.
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ సమర్పించిన కార్బెవాక్స్ టీకాకు సంబంధించిన డేటాను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని, సంతృప్తి చెందితే అత్యవసర వినియోగానికి సిఫారసు చేస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటికే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ 18 సంవత్సరాలుపైబడిన వ్యక్తులకు వేసేందుకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. కేంద్రం కార్బోవాక్స్ టీకాలకు బయోలాజికల్ ఈ కంపెనీ గతేడాది ఆర్డర్ ఇచ్చిన విషయం విధితమే. అయితే, ప్రస్తుతం దేశంలో 97శాతం మంది వయోజన జనాభాకు ఒక్క డోసు టీకా ఇవ్వగా.. 77శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందింది. ఈ క్రమంలో కార్బెవాక్స్ టీకాను బూస్టర్ డోస్‌గా లేదంటే.. పిల్లలకు వేయనున్నట్లుగా తెలుస్తున్నది.