పుతిన్ చర్చల ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం
జెలెన్‌స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ వెల్లడి
స్వదేశంలో ఉంటూనే పోరాడుతామన్న అద్యక్షుడు
అమెరికా ప్రతిపాదనకు తిరస్కారం
కీవ్,ఫిబ్రవరి26(జనం సాక్షి): రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రతిపాదినలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రష్యాతో శాంతి చర్చలు నిర్వహించేందుకు జెలెన్‌స్కీ అంగీకారం తెలిపినట్లు ప్రెస్ సెక్రటరీ సెర్గే నికిఫరోవ్ తెలిపారు. కాల్పుల విరమణకు కూడా జెలెన్‌స్కీ ఆమోదం తెలిపినట్లు సెర్గే చెప్పారు. చర్చలను తిరస్కరించినట్లు వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నామని, శాంతి, కాల్పుల విరమరణ ఒప్పందానికి ఉక్రెయిన్ కట్టుబడి ఉందని, ఇదే మా శాశ్వత సిద్దాంతమని, రష్యా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను తాము అంగీకరిస్తున్నామని తన ఫేస్‌బుక్ పేజీలో సెర్గే తెలిపారు. అయితే శాంతి చర్చలకు సంబంధించిన స్థలం, తేదీ గురించి సంప్రదింపులు జరుపుతున్నట్లు నికోఫరోవ్ తెలిపారు. చర్చలు ఎంత వేగంగా జరిగితే, అంత త్వరగా సాధారణ పరిస్థితులు ఏర్పడుతాయని ఆయన అన్నారు. మిన్‌స్క్‌లో చర్చలు నిర్వహించాలని రష్యా భావించగా.. వార్సాలో జరిగితే బాగుంటుందని
ఉక్రెయిన్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అమెరికా ఆఫర్ ఇచ్చింది. మరో దేశానికి తరలించేందుకు అమెరికా ఆయనకు స్నేహహస్తం అందించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ఆఫర్‌ను జెలెన్‌స్కీ తిరస్కరించినట్లు ఉక్రెయిన్ విూడియా పేర్కొన్నది. ప్రస్తుతం కీవ్ నగరంలోనే ఉన్నట్లు జెలెన్‌స్కీ తాజా వీడియోలో తెలిపారు. రష్యా దాడి తర్వాత జెలెన్‌స్కీ బంకర్‌లోకి వెళ్లారు. తన స్టాఫ్‌తో కలిసి క్రితం ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. అందరం ఇక్కడే ఉన్నామని, ఇక్కడే పోరాడుతామని, తనకు ఆయుధాలు కావాలని వీడియోలో జెలెన్‌స్కీ ప్రకటన చేశారు. దేశాన్ని రక్షించుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు.