పునరావాస కేంద్రాలకు ముంపుగ్రామాల ప్రజలు
సహాయక చర్యలు ముమ్మరం: కలెక్టర్
రాజమండ్రి,ఆగస్ట్18(జనం సాక్షి): గోదావరి వరదల ముంపు గ్రామాల ప్రజల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. అమలాపురంలో 4, రాజమండ్రిలో 2, రంపచోడవరంలో ఒక పునరావాస కేంద్రం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. కాగా… వరదల కారణంగా ఇప్పటి వరకు 832 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని కలెక్టర్ తెలిపారు. గోదావరి లోరెండో ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గిరిజన ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది. పలు గ్రామాలు వరద నీటి మధ్య చిక్కుకున్నాయి. దేవీపట్నం-రంపచోడవరం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంతాల పరిధిలోని మండలాల్లోని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. వరద ఉద్ధృతి కారణంగా పరీవాహక మండలాల పరిధిలోని పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహం తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్, గ్రావిూణ మండలాలతోపాటు కడియం, సీతానగరం, దేవీపట్నం, చింతూరు, కూనవరం, ఎటపాక, వరరామచంద్ర పురం, రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని అన్ని యాజమాన్యాలకు చెందిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈవో తెలిపారు. ఈ విషయాన్ని ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు గమనించి తగు చర్యలు తీసుకోవాలని అబ్రహం కోరారు.ఏజెన్సీలో గోదావరి వెంబడి ఉన్న గిరిజన గ్రామాల్లో వరదలను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని ఐటీడీఏ పీవో నిషాంత్‌కుమార్ తెలిపారు. దేవీపట్నం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న గ్రామాలు ప్రస్తుతం ముంపునకు గురవుతున్నాయని, బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాటు చేశామన్నారు. వరద సహాయక చర్యల్లో భాగంగా సమాచారం నిమిత్తం టోల్‌ఫ్రీ నంబరు 1800 4252123కు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రస్తుతం సహాయక చర్యలను సబ్‌కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌తోపాటు ఏఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌లు చేపడుతున్నారన్నారు. దేవీపట్నం మండలానికి సంబంధించి అయిదు సెక్టార్లుగా సీనియర్ అధికారుల బృందాలను నియమించామన్నారు. ముంపు బాధితులకు భోజన ప్యాకెట్లు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. అగ్నిమాపక బృందంతోపాటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, మరో బృందం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని పీవో వెల్లడించారు.