పులిచింతల సామర్థ్యం పెంచాలి
మిగులు నీటికి ఇదే భద్రత అంటున్న నిపుణులు
గుంటూరు,సెప్టెంబర్26(జనంసాక్షి): పులిచింతల ప్రాజెక్టులో నిల్వ చేయగా మిగతా నీటిని నిల్వ చేసే సామర్థ్యం పూర్తిగా లేకపోవడంతో మిగిలిన దాదాపు 14 టీఎంసీలు ప్రకాశం బ్యారేజీ విూదుగా సముద్రంలో చేరిపోనుంది. భవిష్యత్‌లో కృష్ణానదికి వరద పెరిగితే పులిచింతల సామర్థ్యంపెంచుకుంటే తప్ప వృధానీటిని వాడుకోలేమని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురిసి నీరు వచ్చి చేరిన నిల్వేసుకునే అవకాశం ఇప్పటికీ లేకపోవడంతో కృష్ణా నది నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. గతేడాది పులిచింతల జలాశయంలోకి పెద్ద ఎత్తున ప్రవాహాలు వచ్చాయి. ఇలా వచ్చిన వరద 19 టీఎంసీలు ఉంటుందని లెక్కించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని ఎద్దువాగు, నాగులేరు తదితర వాగులు పొంగి ప్రవహించాయి. ఈ నీరంతా పులిచింతలకు చేరింది. పులిచింతల కొత్త జలాశయం కావడంతో క్రమేణా నీటి నిల్వలు పెంచాలని డ్యాం భద్రతా కమిటీ సూచించింది. జలాశయం మొత్తం నిల్వ 45.7 టీఎంసీలు కాగా గతేడాది 30 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచాలని తెలిపింది. అయితే ఈ యేడు కృష్ణాలో సాగర్‌కే నీరు రాలేదు. దీంతో పులిచింతలకు నీరు చేరే అవకావం రాలేదు. భవిష్యత్ అవసరాల కోసం దీనిని నిర్మించినా ముంపు గ్రామాల్లో పునరావాస కార్యక్రమాలు ఇంకా పూర్తికాలేదు. 35 టీఎంసీల వరకు నిల్వ చేయాలని జలవనరులశాఖ అధికారులు ఆలోచించినా ముంపు గ్రామాలను దృష్టిలో ఉంచుకుని, నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకుని 30 టీఎంసీలకే పరిమితం చేశారు. అందుకే
ప్రాజెక్టు నిండే క్రమంలో నీటిని కిందికి విడచిపెట్టాల్సి వస్తోంది. ఏటా ప్రకాశం బ్యారేజీ నిండుకుంటే పై నుంచి వస్తున్న నీరంతా సముద్రంలోకి విడచిపెట్టక తప్పడం లేదు. నిజానికి శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయిలో నిండే పరిస్థితి ఇంకా రాలేదు. నాగార్జునసాగర్ దిగువన నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. దీంతో నీటి నిల్వలకు అవకాశాలను పెంచుకుంటే భవిష్యత్‌లో ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.