పెండింగ్ లో ఉన్న వేతనాన్ని వెంటనే విడుదల చేయాలి

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి) : గత తొమ్మిది నెలలుగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ వాచర్ ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపెల్లి సైదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఉపాధి హామీ పథకం క్రింద గ్రామీణ ప్రాంతంలో పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ దామాలలో మొక్కల పెంపకం, మొక్కలకు నీరు పోయడం, పిచ్చి చెట్ల తొలగింపు వంటి పనులు చేసే వాచర్లకు గత తొమ్మిది మాసాలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న వందలాది మంది ఉపాధి హామీ వాచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.సకాలంలో వేతనాలు అందక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని , ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న వేతనాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సంఘ జిల్లా ఉపాధ్యక్షులు పులుసు సత్యం , జిల్లా సహాయ కార్యదర్శి బచ్చలకూర రాంచరణ్ పాల్గొన్నారు.