పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలి

కెసిఆర్‌ నిజాయితీ నిరూనించుకోవాలి: బిజెపి
కరీంనగర్‌,మే 24(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిస్తూ
సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి అన్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాట్‌ తగ్గించాలన్నారు. ప్రధానమంత్రి మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు హృదయ పూర్వక ధన్యవాదాలు చెబుతున్నామన్నారు. దీనివల్ల లక్ష కోట్ల అదనపు భారం పడుతున్నా పేదలను ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వ్యాట్‌ పేరుతో దోచుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను తగ్గిస్తే రాష్ట్రంలో లీటరు పెట్రోల్‌ 80 రూపాయలకు అందించవచ్చని, కేసీఆర్‌ మాత్రం ఆ పనిచేయకుండా ప్రజలపై భారం మోపుతూ కేంద్రంపై నెపాన్ని నెట్టడం సిగ్గుచేటన్నారు. రైతులను,నిరుద్యోగులను పట్టించుకోని కేసీఆర్‌ మాత్రం సంచలనం సృష్టిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతూ ఇతర రాష్టాల్రకు వెళ్తున్నారన్నారు. పత్రికల్లో, టీవీల్లో హెడ్‌ లైన్ల కోసమే కేసీఆర్‌ సంచలనం చేస్తానంటున్నారేతప్ప ఆయన చేసేదేమి లేదన్నారు. కేసీఆర్‌ను ఇతర రాష్టాల్ర నేతలు జోకర్‌లా చూస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు సక్రమంగా జీతాలిచ్చే పరిస్థితి కూడా లేదని, పేదలకు పెన్షన్లు కూడా సరిగా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది రైతులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిదంగా తెలంగాణలో 27 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఏనాడూ ఒక్క కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా ఏ ఒక్క కుటుంబానికి నయాపైసా సాయం చేయని కేసీఆర్‌ పంజాబ్‌ వెళ్లి అక్కడి రైతులకు సాయం చేయడం సిగ్గుచేటన్నారు.