పెట్రో ధరలకు సిపిఎం నిరసన
గూడూరు,సెప్టెంబర్6జనంసాక్షి): 15 న విజయవాడలో నిర్వహించనున్న మహాగర్జన సంసిద్ధతకు సిపిఎం-సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన సిపిఎం-సిపిఐ బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. నేతలు అడుగుపెట్టే ప్రతీచోట ప్రజలు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం సిపిఎం, సిపిఐ బస్సు యాత్ర గూడూరుకు చేరింది. పెట్రోల్ ధరలకు నిరసనగా బస్సు యాత్ర బృందం నాయకులు ఎద్దుల బండిని నడిపారు. హెచ్ పి పెట్రోల్ ధరలు తగ్గించాలని, మోడీ ప్రభుత్వం నశించాలని నినాదాలు చేశారు. ఎద్దుబండికి ముందు వరుసలో ఆటో కార్మికులు అర్థ నగ్నంగా ఆటోలను తాడుతో కట్టి లాగుతూ తమ నిరసన తెలిపారు. అనంతరం సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్రంలో, రాష్ట్రంలో మోసపు పాలన జరుగుతోందన్నారు. వాళ్లకు ఒక్క క్షణం కూడా పరిపాలించే అర్హత లేదని, రాష్టాన్రికి ఉత్తమ పాలన కావాలని కోరారు. సిపిఎం, సిపిఐ నిర్వహించనున్న సెప్టెంబర్ 15 మహాగర్జనలో అందరూ పాల్గని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.