పెథాయ్‌ కల్లోలం

– ‘ఫెథాయ్‌’తో అతలాకుతలమవుతున్న తీరప్రాంత జిల్లాలు
– కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకిన ఫెథాయ్‌
– 100 కి.విూ వేగంగా వీస్తున్న గాలులు
– తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
– విజయవాడ, విశాఖ, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు
– కోనసీమ వ్యాప్తంగా కుండపోత వర్షం
– ఈదురు గాలులతో విరిగిపడిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు
– పలు ప్రాంతాల్లో విద్యుత్‌ను నిలిపివేత
– అప్రమత్తమైన అధికార యంత్రాంగం
– సహాయక చర్యల్లో పాల్గొనండి
– అధికారులను ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, డిసెంబర్‌17(జ‌నంసాక్షి) : ఏపీలోని తీర ప్రాంత జిల్లాల ప్రజలను ‘ఫెథాయ్‌’ తుఫాను హడలెత్తిస్తోంది. తీవ్ర తుపానుగా మారిన ‘పెథాయ్‌’ సోమవారం మధ్యాహ్నం 12.15 గంటలకు కాట్రేనికోన వద్ద తీరాన్ని తాకింది. అమలాపురానికి 20 కి.విూ దూరంలో కేంద్రీకృతమైంది. దీంతో తీరం వెంబడి గంటలకు 80 నుంచి 100 కి.విూ వేగంగా భారీగా ఈదురుగాలు వీస్తున్నాయి. తుఫాన్‌ కారణంగా మరో 24గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే కోనసీమ వ్యాప్తంగా భారీ వర్షాలతో పాటు ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెథాయ్‌ తుపాను కారణంగా ఆంధప్రదేశ్‌లో కొన్ని రైళ్లు రద్దయ్యాయి. తుపాను ప్రభావం అధికంగా ఉండే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌, విజయవాడ, గుంటూరు వెళ్లే జన్మభూమి, రత్నాచల్‌, సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. అంతేకాక విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ మధ్య నడిచే మరికొన్ని ప్యాసింజర్‌ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.   రద్దైన రైళ్ల వివరాలు… రైలు నెంబరు 67243 కాకినాడ-విశాఖ, 57225 విజయవాడ-విశాఖ, 57226 విశాఖ-విజయవాడ, 67295 రాజమహేంద్రవరం-విశాఖ,  67247 రాజమహేంద్రవరం-విశాఖ, 67296 విశాఖ-రాజమహేంద్రవరం మధ్య రైళ్ల రాకపోకలు రద్దయ్యాయి. అదేవిధంగా ఫెథాయ్‌ తుపాను ప్రభావం తూర్పుగోదావరి జిల్లాపై తీవ్రంగా ఉంది. తుపాను కారణంగా ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం కోనసీమ వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. అమలాపురం డివిజన్‌లోని 16 మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 32 మి.మి అత్యధిక వర్షపాతం ఆత్రేయపురం మండలంలో నమోదు కాగా అత్యల్పంగా అంబాజీపేట మండలంలో 16.4 శాతం నమోదైంది. అలాగే రావులపాలెంలో 22, కొత్తపేటలో 25.4 మి.మి, ముమ్మిడివరంలో 25 మి.మి, అయినవిల్లిలో 25.4 మి.మి, పి గన్నవరంలో 22.4 మి.మి, ఐ పోలవరం మండలంలో 18.4 మి.మి, మామిడికుదురులో 23.2, రాజోలులో 34.8, మలికిపురంలో 30.4, సఖినేటిపల్లిలో 27 మి.మి, అల్లవరంలో 21.08 మి.మి, ఉప్పలగుప్తంలో 20.2 మి.మి, కాట్రేనికోనలో 20.08 మి.మి వర్షపాతం నమోదైంది. తుఫాన్‌ ప్రభావంతో భారీగా ఈదురు గాలులు వీస్తుండటంతో తీర ప్రాంతాల్లోని ప్రలు గ్రామాల్లో చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి రహదారులపై నడిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ను బంద్‌ చేసిన అధికారులు, గ్రామాల్లో ప్రధాన రహదారులకు
అడ్డుగా పడిన చెట్లు, కరెంట్‌ స్తంభాలను తొలగించే పనిలో నిమగ్నమయయారు. మరోవైపు వరి, జొన్న తదితర ధాన్యాలను కోసినవారు వాటిని తక్షణం గోదాముల్లో భద్రపరచాలని ఇప్పటికే అధికారులు సూచించారు. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్‌ పట్టలు కప్పి భధ్రపరచాలని.. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి రైతులు వీటిని పొందవచ్చని తెలిపారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో ఉంటున్నవారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. తుపాను తీరం దాటే వరకు ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఫెథాయ్‌ ప్రభావంతో తూర్పుగోదారి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గంటకు 80 నుంచి 90 కి.విూ వేగంతో గాలులు వీయనున్నాయి. తీరం దాటే సమయంలో పెనుగాలులతో కూడిన వర్షం విరుచుకుపడనుందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
సహాయక చర్యల్లో పాల్గొనండి – సీఎం చంద్రబాబు
పెనుతుపానుగా మారిన పెథాయ్‌ తీరానికి చేరువ అవుతుండటంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా ప్రభావిత జిల్లాల కలెక్టర్లను, యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. రాజస్థాన్‌ సీఎంగా అశోక్‌ గెహ్‌లాట్‌ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈసందర్భంగా అక్కడి నుండే అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాబోయే 48గంటలు అప్రమత్తంగా ఉంటూ సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. పెథాయ్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు పంటలు తడిచిపోకుండా చూడాలని, రైతులకు అన్ని విధాలా సహాయపడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రేయింబవళ్లు దాన్యాన్ని కొనుగోలు చేయాలని, పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని స్పష్టం చేశారు. పెథాయ్‌ ప్రమాదం పొంచి ఉన్న కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సహా 2వేల మందిని మోహరించినట్లు వెల్లడించారు.పెథాయ్‌ తీరం దాటనున్న నేపథ్యంలో 22 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్‌ అంచనా వేయడంతో ఆ మేరకు ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
తుపాను ప్రభావిత జిల్లాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించి దానికి తగ్గట్లుగా పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. విపత్తును ఎదుర్కోవడంపై ప్రతిశాఖ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని అందుకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
తూ.గో జిల్లాపైనే అధిక ప్రభావం – మంత్రి చినరాజప్ప
పెథాయ్‌ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. పంట నష్టాలను మిగుల్చుతోంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో అరటి తోటలు నేలకొరిగాయి. కాకినాడ కలెక్టర్‌ కార్యాలయంలో పెథాయ్‌ తుపాను తీవ్రతపై ¬ంమంత్రి చిన రాజప్ప అధికారులతో సవిూక్ష నిర్వహించారు.  ఫెథాయ్‌ తీవ్రత తూర్పు గోదావరి జిల్లాపైనే అధికంగా ఉంటుందని తెలిపారు. తీరం దాటే సమయంలో 90-100 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ‘ఇప్పటివరకూ 107 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. పునరావాస
కేంద్రాల్లో మంచి నీరు, ఆహార పదార్ధాల కొరత లేకుండా చూస్తున్నాం. తుపాను తీరం దాటిన తరువాత, ఆ ప్రాంతంలో సాయంత్రంలోగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉంటుందని మంత్రి చిన రాజప్ప తెలిపారు.