పెన్షన్లకే సరిపెడితే ఎలా?

సమస్యలు పరిష్కరించాలని వినతి
ఏలూరు,జనవరి5(జ‌నంసాక్షి): జన్మభూమి-మఊ/ూరు కార్యక్రమాలను కేవలం సామాజిక పింఛన్ల పంపిణీతో  సరిపెడుతున్న పరిస్థితి ఉందని సిపిఎం నాయకులు విమర్శించారు. దీనికోసం జన్మభూమి ఎందుకని ప్రశ్నించారు. సభా, సమావేశాలు నిర్వహించడానికి సంబంధిత వార్డుల్లోని పింఛనుదారులు సమావేశాలకు రావాలని అధికారులు హుకుం జారీచేయడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు జన్మభూమి సభలకు పరుగెడుతున్నారు.ఈసారైనా ఇచ్చిన దరఖాస్తులకు ఫలితం ఉంటుందా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో పింఛన్ల పంపిణీయే ప్రధాన కార్యక్రమంగా నిర్వహిస్తున్న నేతలకు అగచాట్లు తెచ్చిపెడుతున్నాయి. గత జన్మభూమిలో రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి నేటికీ రేషన్‌కార్డులు మంజూరు కాలేదని పలువురు వాపోతున్నారు. ఈసారి జన్మభూమి కార్యక్రమంలో మంజూరైన రేషన్‌కార్డులు పంపిణీ చేస్తారని భావించిన ప్రజలకు నిరాశే మిగులుతుంది. కానీ నాయకులు , అధికారులు మాత్రం ఎన్‌టిఆర్‌ గృహాలు,
రేషన్‌కార్డులకు, గ్యాస్‌ కనెక్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పింఛనుదారులతోనే జన్మభూమి సభలు నిర్వహిస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇకపోతే అధికారులు, నాయకులు ప్రజలకు అందుబాటు లోకిరాని పథకాల గురించి అవగాహన కల్పించడంపై ప్రజలు విసుగు చెందుతున్నారు. నగదురహితం, సామాజిక న్యాయం, ప్రతికుటుంబానికి కనీస వేతనం రూ.పదివేలు కల్పించేదుకు మార్గాలు కల్పించడం వంటివాటిపై అవగాహన పొందాలని నాయకులు, అధికారులు చెప్పడం ప్రజలనాడికి అందడం లేదు. ఉపన్యాసాల అనంతరం అక్కడకు వచ్చిన పింఛనుదారులకు పింఛన్లు అందించడంతో కార్యక్రమం ముగుస్తుంది.