పెన్షన్ పునరుద్దరించాల్సిందే
దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
విజయవాడ,సెప్టెంబర్29(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని పీఆర్‌టీయూ నాయకులు ప్రకటించారు. 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు పొందినవారికి సీపీఎస్ విధానంవల్ల ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ దృష్ట్యా సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాతపింఛను విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీని కోసం అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి సంఘటిత పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు నిబంధనలు సాధించినట్లుగానే దీనిపైనా పోరాడి సాధిస్తామని అన్నారు. ఏకీకృత సర్వీసు నిబంధనలకు ఆమోదం లభించినందున రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న మండల, ఉపవిద్యాశాఖాధికారుల కొలువులు, డైట్ అధ్యాపకుల కొలువులు, జూనియర్ అధ్యాపకుల కొలువులు రెగ్యులర్ ప్రాతిపతికన భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఎంఈవో కొలువులు ఖాళీగా ఉన్నాయని, అర్హత కలిగిన ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా పదోన్నతులు కల్పించాల్సి ఉందన్నారు. బీఈడీ, టెట్, డీఎస్సీ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించినవారికి సామర్థ్య పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో చెప్పాలన్నారు. అవసరమైతే ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు
నిర్వహించుకోవాలే తప్ప ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇలాంటి పరీక్షల నిర్వహణ సరికాదన్నారు. ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలు ఇవ్వడంలో తప్పులేదుకానీ, సామర్థ్య పరీక్షలు నిర్వహించి గ్రేడింగులు ఇవ్వాలనుకోవడం సహేతుకం కాదని పేర్కొన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగ అభివృద్ధికి వినియోగించడం మంచి పద్ధతే అయినప్పటికీ ఉపాధ్యాయులకు బోధనేతర విధులు అప్పగించడం సరికాదన్నారు. సాంకేతికత పేరుతో ఉపాధ్యాయులకు పనిభారం పెంచితే బోధన కుంటుపడుతుందన్నారు.