పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలి -తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా –
-తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
టేకులపల్లి,నవంబర్ 10 (జనం సాక్షి ): పేదలందరికీ ఇండ్లు, ఇంటి స్థలాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభ కడుదుల వీరన్న అద్యక్షతన వినోదరావు రవికుమార్ భవన్ లో జరిగింది. అనంతరం సంత గ్రౌండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారాలు మోపుతుందని వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్ డీజిల్ ధరలను,నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇంటి స్థలం లేని పేదలందరికీ ప్రభుత్వం భూమిలో ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. రేషన్ షాపుల ద్వారా కేరళ ప్రభుత్వం ఇచ్చినట్లు 14రకాల సరుకులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ తహశీల్దార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకులు ఈసం నరసింహారావు, వీరన్న,పూనెం స్వామి,పూనెం చిన్ననర్సు,పాయం వెంకన్న,దొడ్డ సావిత్రి,వజ్జ నాగేశ్వరరావు,పోలెపొంగు లక్ష్మన్,జోగ రవీందర్, తదితరులు పాల్గొన్నారు.