పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వం లక్ష్యం

` అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం
` మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తాం:మంత్రి ఉత్తమ్
నేరేడుచర్ల(జనంసాక్షి):రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని మరింత అభివద్ధి చేస్తా. పేదల జీవితాలలో వెలుగు నింపడమే తన ధ్యేయం.మహిళల జీవితాలలో ప్రత్యేకించి పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అందులో భాగంగానే వడ్డీ లేని రుణాల పంపిణీ ఇస్తున్నట్లు రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం అయన సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ ఆవరణలో నేరేడుచర్ల మున్సిపల్ పరిధిలోని 404 స్వయం సహాయక మహిళా సంఘాలకు 52, 07,399 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు.అంతేకాక ఇందిరా మహిళా శక్తి పథకం కింద 5498 మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తాను ప్రజా జీవితంలో తపస్సులా ముందుకెళ్తున్నానని పేదల జీవితాలు బాగుపడేలా చేయడమే తన ధ్యేయమని అన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో వడ్డీ లేని రుణాల పంపిణీ తో పాటు 5498 మందికి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ నుండి నేరేడుచర్ల, కోదాడ విÖదుగా ఖమ్మం జాతీయ రహదారి వరకు రహదారిని వేయించింది గతంలో తానేనని గుర్తు చేశారు.ఉన్నత విద్యను అభ్యసించేందుకు హుజూర్నగర్ లో 7.50 కోట్ల రూపాయలతో జూనియర్ కళాశాలను, 4.50 కోట్ల రూపాయలతో డిగ్రీ కళాశాల భవనాలు నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని,హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2.5 కోట్లతో సిటీ స్కాన్, డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకుగాను హుజూర్నగర్ లో మెగా జాబ్ మేళాలను నిర్వహిస్తే 40 వేల మంది రిజిస్టేషన్ చేసుకొని 4500 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.ప్రజా ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం పేద ప్రజలకు దొడ్డు బియ్యాన్ని ఇచ్చేదని అలాంటిది మేము అధికారంలోకి వచ్చాక సన్న బియ్యం ఇస్తున్నామని అంతేకాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ వడ్డీ లేని రుణాలు మహిళా సంఘాల పెద్ద భరోసా అని అన్నారు. బ్యాంకు లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లించి వారికి పెద్ద ఎత్తున తోడ్పాటు అందిస్తున్నదన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీలో 52,07,399 రూపాయల వడ్డీ లేని రుణంతోపాటు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఆర్పీ లు, మున్సిపల్ సిబ్బంది ఇందిరమ్మ చీరలను జాగ్రత్తగా అర్హులైన ప్రతి ఒక్కరికి బాధ్యతగా పంపిణీ చేసి ప్రతి చీరకు రసీదు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా ఎస్పీ కే నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ బెల్లంకొండ విజయలక్క్ష్మి, వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి,ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి,మెప్మా సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.



