పేదవాడికి భద్రత, భరోసా, ధైర్యం.. ఇందిరమ్మ ఇళ్లు

` అర్హులందరికీ అందిస్తాం
` దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టని విధంగా నిర్మిస్తున్నాం
`నాణ్యతతో పనులు పూర్తి చేయాలి
` మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
హుజూర్‌నగర్, (జనంసాక్షి): అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్, పౌర సరఫరాల శాఖా మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి లు అన్నారు. పేదవాడికి పూర్తి భద్రత, భరోసా, ధైర్యాన్ని ఇచ్చే కార్యక్రమమే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమమని, ఈ ఏప్రిల్ లో మరో విడత, రానున్న 2 సంవత్సరాలలో 2 విడతల్లో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. బుధవారం హుజూర్ నగర్ లోని రామస్వామి గుట్ట వద్ద నిర్మిస్తున్న 2160 ఇందిరమ్మ ఇళ్ల కాలనీలో గృహ నిర్మాణాలను వారు తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం కాలేశ్వరం పేరుతో లక్ష కోట్లు కొల్లగొడితే ఆ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి విడతన 22500 కోట్ల రూపాయలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున 4 లక్షల 50వేల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసామని తెలిపారు. రాజకీయాల కతీతంగా కులం, మతం, వర్గం పేరు అడగకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చెప్పారు. ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు వెచ్చించి ఇండ్లు కట్టిస్తున్నామని, ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రతి సోమవారం దశలవారీగా బిల్లులు చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో తమ ఎమ్మెల్యేలతో పాటు, ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా మరిన్ని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతున్నారని,అలాగే గతంలో గృహ జ్యోతి కింద మంజూరు చేసిన ఇండ్లను పూర్తి చేయాలని ఇతర పార్టీ ల ఎం ఎల్ ఏ ఏ లు కోరారని, వాటిని కూడా మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మంత్రి వెల్లడిరచారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే కమిషన్ వస్తుందని ఆలోచించింది తప్ప పేదవాడికి ఇండ్లు కట్టించలేదన్నారు. అంతేకాక గృహ నిర్మాణ శాఖను అస్తవ్యస్తం చేసిందని అన్నారు. హుజూర్ నగర్ లో చేపట్టిన 2160 ఇందిరమ్మ హోసింగ్ కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. హుజూర్ నగర్ రామస్వామి గుట్ట లో చేపట్టిన ఇల్లన్నింటిని ఈ మార్చి 31 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఆదేశం ఇచ్చామని, గృహ నిర్మాణ పాలసీ ప్రకారం బహు పేదల నుండి ఇండ్లకు దరఖాస్తులను తీసుకొని మార్చి 31 లోపు వారికి ఇల్లు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. సంక్రాంతి లోపు లేదా ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులను గుర్తించి తుది జాబితా రూపొందించాలని చెప్పారు. హుజూర్ నగర్ లోని బడుగు, బలహీన వర్గాల పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని తెలిపారు. అంతకు ముందు హుజూర్ నగర్ ఇందిరమ్మ ఇండ్ల కాలనీ లో ఇండ్ల నిర్మాణాల పై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, గృహనిర్మాణ శాఖ అధికారులు, కాంట్రాక్టర్ తో సవిూక్షించారు. ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మార్చి 31 నాటికి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పారు. ఇంజనీరింగ్ అధికారులు తక్షణమే క్షేత్రస్థాయిలో పరిశీలించి మిగిలిపోయిన పనులన్నింటిని గుర్తించి పనుల పూర్తికి ప్రతిపాదనలు పంపించాలని, గృహ నిర్మాణాలతోపాటు, రోడ్లు, విద్యుత్, తాగునీరు, వంటి మౌలిక సదుపాయాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. హుజూర్నగర్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు పురోగతిని పరిశీలించి నిర్దేశించిన సమయంలోగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేలా చూడాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. మిగిలిపోయిన పనుల పూర్తికి అవసరమైన అంచనాలను రూపొందించి పంపిస్తే ఈ నెల 15లోగా అనుమతులు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. అవసరమైతే పనులను విభజించి పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2012లో తాను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో హుజూర్ నగర్ హౌసింగ్ కాలనీ ని మంజూరు చేయించడం జరిగిందని, ప్రభుత్వ భూమి లేకపోయినప్పటికీ, దేవాదాయ శాఖ భూమి సుమారు 115 ఎకరాలను సేకరించి ప్రభుత్వానికి నిధులు చెల్లించి పనులు ప్రారంభించామని, గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 సంవత్సరాలలో పూర్తిగా పనులు నిలిపివేసిందని, తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన, ప్రాధాన్య పథకాల కింద గృహ నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. హుజూర్ నగర్ ఇందిరమ్మ ఇండ్ల కాలనీ తెలంగాణలోనే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా నిరుపేదలకు మోడల్ హౌసింగ్ కాలనీగా నిలుస్తుందని తెలిపారు. హుజూర్ నగర్ ఇందిరమ్మ కాలనీలో ఇళ్లకు మెరిట్ ఆధారంగా వెంటనే దరఖాస్తులను తీసుకోవాలని, నిరుపేదలు, ఇండ్లు లేని వారు,నూటికి నూరు శాతం అర్హత ఉన్న వారికే ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చేలా ఇందిరమ్మ ఇండ్ల నియమ, నిబంధనల ప్రకారం దరఖాస్థులు తీసుకోవాలని ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ఇందిరమ్మ కాలనీలో ఇండ్ల నిర్మాణంతో పాటు, పాఠశాల ,అంగన్వాడి, హెల్త్ సెంటర్ ,కమ్యూనిటీ హాల్, ప్లే గ్రౌండ్ వంటి మౌలిక సదుపాయాలన్ని కల్పిస్తామని తెలిపారు. హుజూర్ నగర్ హౌసింగ్ కాలనీ పూర్తికి ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టర్ కు పూర్తి సహకారం అందిస్తామని , నాణ్యతతో పనులు పూర్తి చేయాలని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సన్న బియ్యంతో పాటు, ఇందిరమ్మండ్లకు మంచి పేరు ఉందని అన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ త్వరలోనే సూర్యాపేట జిల్లా హుజూర్ గర్ నియోజకవర్గం మఠంపల్లి కి రానున్నట్లు వెల్లడిరచారు. అంతకు ముందు మంత్రులు రామస్వామి గుట్ట ఇందిరమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను , సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సెక్రెటరీ గౌతం , జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, జిల్లా గృహ నిర్మాణ శాఖ పిడి సిద్దార్థ్, ఆర్డీవో శ్రీనివాసులు, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



