పేద విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ
ఆదిలాబాద్, నవంబర్ 3 : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదువుతున్న పేద విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందజేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అశోక్ తెలిపారు. జిల్లాలోని ఆయా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల వివరాలను వెంటనే అందజేయాలని సంబంధిత విద్యాధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలలో పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులందరూ చదివేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. విద్యార్థులకు దుస్తులను వెంటనే అందజేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో ఈ నెల పదవ తేదీలోగా దుస్తులను అందించేలా చర్యలు తీసుకోవడమే కాకుండా మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్లక్ష్యం చేయకుండా నాణ్యమైన ఆహారాన్ని అందించాలని అన్నారు. ఈ ఏడాది పదవ తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం ఈ నెల 5వ తేదీ నుంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని అన్నారు.