పేర్ని నానిపై దాడితో పోలీసుల అప్రమత్తం

గుడివాడలో కొడాలి నాని ఇంటికి భద్రత పెంపు
విజయవాడ,డిసెంబర్‌3 (జనంసాక్షి) : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై దాడి జరిగిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని మంత్రుల నివాసం, కార్యాలయాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టారు. గుడివాడలోని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని నివాసంలో మెటల్‌ డిటెక్టర్‌, డిజిటల్‌ స్కానర్లను ఏర్పాటు చేశారు. మంత్రి నివాసాన్ని అధీనంలోకి తీసుకున్న భద్రత సిబ్బంది ఆయన నివాసాన్ని డాగ్‌ స్క్వాడ్‌తో అణువణువునా తనిఖీలు చేస్తోంది. సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే మంత్రి నివాసంలోకి అనుమతిస్తున్నారు. కాగా, మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం కేసులో పోలీసులు దూకుడు పెంచారు. కోర్టు అనుమతితో నిందితుడు బడుగు నాగేశ్వరరావును మచిలీపట్నం సబ్‌ జైలు నుంచి కస్టడీకి తీసుకొన్నారు. రెండురోజుల పాటు విచారించనున్నారు. నిందితుడితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్న టీడీపీ నేతలతో పాటు అతడి సోదరి బడుగు ఉమాదేవిని ఇప్పటికే విచారించారు. నిందితుడి కాల్‌ డేటాని కూడా పరిశీలిస్తున్నారు. హత్యాయత్నంపై నిరాధార వ్యాఖ్యలతో కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు సెక్షన్‌ 91 కింద నోటీసులు పంపారు. ఆధారాలతో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. హత్యాయత్నంలో కుట్రకోణంపై వేగంగా విచారణ సాగుతుండటంతో నిందితుడు నాగేంద్రతో టచ్‌లో ఉన్న టీడీపీ నేతల గుండెల్లో దడ మొదలైంది. పోలీసుల కస్టడీలో నాగేశ్వరరావు ఏమి చెబుతాడోనని వెన్నులో వణుకుమొదలైంది. దీంతో టీడీపీ అగ్రనేతలను సంప్రదిస్తునట్టు తెలుస్తోంది.