పోడు,సాగు రైతులకు సిపిఐ అండగా ఉంటుంది

పోడు రైతులకు పట్టాలివ్వాలి
కేసముద్రం జూన్27(జనం సాక్షి)పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి చొప్పరి శేఖర్, మండల సహాయ కార్యదర్శి మంద భాస్కర్ అన్నారు.సోమవారం మండల కేంద్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) ఆధ్వర్యంలో మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా చొప్పరి శేఖర్, మంద భాస్కర్ మాట్లాడుతూ… అనేక దశాబ్దాలుగా దళితులు,గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు పోడు చేసుకొని సాగు చేస్తున్నారన్నారు.రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు భూమితల్లిని నమ్ముకుని తమ కుటుంబాలను పోషించేందుకు   వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నారన్నారు.2006అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కుపత్రాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంభిస్తోందన్నారు.2019 ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ తానే స్వయంగా చొరవ చూపి,కుర్చీ వేసుకొని పోడు,సాగు రైతులకు పట్టాలు ఇప్పిస్తానని చెప్పిన వాగ్దానం అటకెక్కిందని, సీఎం కేసీఆర్ మాటలు కోటలు దాటి చేతలు గడప దాటవు అన్న చందంగా మారాయని దుయ్యబట్టారు.పోడు భూముల పరిష్కారం కోసం గ్రామాలలో కమిటీలు వేయడం జరిగిందని,ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ కమిటీలకు పోడు రైతులు దరఖాస్తు చేసుకొని ఎనిమిది నెలలు గడిచినా నేటికి అతీగతి లేదని విమర్శించారు.పట్టాలు ఇచ్చే వరకు మడమ తిప్పని పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ప్రభుత్వ ఆగడాలకు వ్యతిరేకంగా పోడు సాగు రైతులకు సీపీఐ అండగా ఉంటుందని అన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు రైతులకు హక్కు హక్కు పత్రాలిచ్చి రైతుబంధును,రైతు బీమా ను వర్తింప చేయాలని,పోడు రైతులకు వడ్డీలేని రుణాలను బ్యాంకు నుండి బేషరతుగా ఇప్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అందె గురవయ్య, సుధాకర్, మంజ, చక్రు,సోమ్లా, లాల్ సింగ్ లచ్చి రామ్  తదితరులు పాల్గొన్నారు.