పోరాటయోధులను తలచుకోవడమే నిజమైన నివాళి

విజయవాడలో క్విట్‌ ఇండియా వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్‌

భారీ జాతీయ జెండాతో ప్రదర్శన

విజయవాడ,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): క్విట్‌ ఇండియా ఉద్యమ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. 75 విూటర్ల పొడవైన జాతీయ జెండాతో ప్రదర్శన చేశారు. లెనిన్‌ సెంటర్‌ నుంచి ఆంధ్రరత్న భవన్‌ వరకూ పీసీసీ, సేవాదళ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఉమెన్‌చాందీ, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం క్విట్‌ ఇండియా అని- అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని భారతదేశం వైపు ఆకర్షించేలా చేసిందని ఉమెన్‌చాందీ అన్నారు. ఇదే రోజున యువజన కాంగ్రెస్‌ ఆవిర్భావం… ఆదివాసీ దినోత్సవం కూడా జరగడం సంతోషదాయకమని చెప్పారు. పోరాటయోధుల జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ- వారి అడుగుజాడల్లో నడవడమే నిజమైన నివాళిగా ఉమెన్‌చాందీ పేర్కొన్నారు. క్విట్‌ ఇండియా నినాదంతో తెల్లదొరతనపు బానిస బతుకుల్ని వదిలించుకోగలిగామని పీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నాటి మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకోవడమే కాదు, వాటి అంతరార్థాన్ని నేటి తరాలు అర్థం చేసుకోవాలని ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు, అత్యాచారాలు, దాడుల్ని భరించి తమ సర్వస్వాన్ని ఎందరో మహనీయులు త్యాగం చేశారని చెప్పారు.

తాజావార్తలు