పోరాటాల పురిటి గడ్డ ఓయూలో తెలంగాణ కోసం మరో ఆత్మ బలిదానం
శవయాత్రకు అనుమతించని పోలీసులు
పలుమార్లు బాష్పవాయు ప్రయోగం, ఉద్రిక్తత
ఆత్మబలిదానాలొద్దు: కోదండరాం
హైదరాబాద్, నవంబర్ 7 (జనంసాక్షి):
పోరాటాల పురిటి గడ్డ ఓయూలో తెలంగాణ కోసం మరో విద్యార్థి ఆత్మ బలిదానం చేసుకున్నాడు..తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశాడు. బిఎస్‌సి చదువుతున్న సంతోష్ అనే యువకుడు బుధవారం ఓయు ఆర్ట్స్ కళాశాల వద్ద ఒక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వద్ద సూసైడ్ నోట్ లభ్యమైంది. తెలంగాణ ఇవ్వనందుకే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు అందులో ఉంది. ఈ ఉదంతంతో సంతోష్ చదువుతున్న తుక్కుగూడలోని సరస్వతి కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. ఆ కళాశాలలో సంతోష్ బిఎస్‌సి చదువుతున్నాడు. ఇదిలా ఉండగా సంతోష్‌ది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచలాపూర్.
ఓయు వద్ద ఉద్రిక్తత
ఈ సందర్భంగా ఓయూ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంతోష్ మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు యత్నించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓయులో భారీగా
పోలీసులు మోహరించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు మండిపడుతున్నారు. ఓయు నుంచి గన్‌పార్కు వరకు సంతోష్ అంతిమయాత్ర కొనసాగిస్తామని కోరారు. అందుకు పోలీసులు నిరాకరించారు. ఓయులోని ప్రధాన గేట్ల వద్ద కూడా భారీగా పోలీసులను మోహరింపజేశారు. ఇదిలా ఉండగా విద్యాసంస్థలన్నీ బంద్ పాటించాలని ఓయు విద్యార్థుల జెఎసి పిలుపునిచ్చింది.
పరీక్షలు వాయిదా
ఉస్మానియాలో ఈ నెల 7,8 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు రిజిస్ట్రార్ బుధవారం నాడు ప్రకటనలో పేర్కొన్నారు. పీజీ ఇంటర్నల్ పరీక్షలు కూడా వాయిదా వేశామన్నారు. ఆ పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలోనే తెలియ జేస్తామని వివరించారు.
అధైర్యపడొద్దు : కోదండరామ్
తెలంగాణ భవిష్యత్తు కార్యాచరణలో ఉన్నామని ఏ ఒక్కరూ అధైర్యపడద్దని, కొట్లాడి సాధించుకుందామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. బిఎస్‌సి విద్యార్థి సంతోష్ పార్దీవ దేహానికి బుధవారం ఉదయం శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చేసిన మోసం వల్లే మనస్తాపానికి గురైన విద్యార్థులు ఇక తెలంగాణ రాదేమోనన్న ఆవేదనతో తమ జీవితాలను చాలించు కుంటున్నారన్నారు. తక్షణమే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉస్మానియా వర్శిటీకి రావాలని కోదండరామ్ డిమాండు చేశారు. తెలంగాణ రాష్ట్రం పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఇదిలా ఉండగా సంతోష్ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించేందుకు వస్తున్న నాయిని నర్సింహారెడ్డిని ఓయు పిఎస్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.
శాంతియాత్రకు అనుమతి ఇవ్వండి : విద్యార్థులు
ఒయు క్యాంపస్ నుంచి గన్‌పార్కు నుంచి శాంతియాత్ర నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ఓయు విద్యార్థులు పోలీసులను కోరారు. అందుకు పోలీసులు నిరాకరించారు. సంతోష్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని డిమాండు చేశారు. అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కూడా కోరారు. ఇదిలా ఉండగా సంతోష్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయినట్టు సమాచారం.