పోలవరంపై జగన్‌ అసత్య ప్రచారాలు


– ఏపీ గురించి జీవీఎల్‌కు ఏం తెలుసని మాట్లాడుతున్నాడు
– ఏపీ మంత్రి  దేవినేని ఉమామహేశ్వరరావు
అమరావతి, నవంబర్‌19(జ‌నంసాక్షి) : పోలవరంపై జగన్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.  సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జీవీఎల్‌, కన్నా లక్ష్మీనారాయణ ధర్నాలు చేయడం సిగ్గుచేటని, జీవీఎల్‌కు రాష్ట్రం గురించి ఏం తెలుసని మంత్రి ప్రశ్నించారు. అమరావతి నిర్మాణాన్ని అందరూ అభినందిస్తుంటే జగన్‌, జీవీఎల్‌, కన్నాకు అభివృద్ధి కనబడటం లేదని ఎద్దేవాచేశారు. జీవీఎల్‌, కన్నా.. భాజపాను రాష్ట్రంలో భూస్థాపితం చేస్తున్నారన్నారు. ఈ నెల 22 న ఢిల్లీలో భాజపా వ్యతిరేక పార్టీల భేటీ జరనుందని, మరోవైపు మమత బెనర్జీతో చంద్రబాబు భేటీ అవుతున్నారని, ఈ నేపథ్యంలో విజయవాడలో భాజపా నేతలు ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. పోలవరం రేడియల్‌ గేట్లు డిసెంబర్‌ 17న పెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ నెల 26న గోదావరి, పెన్నా అనుసంధానం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి సస్యశ్యామలం చేస్తున్నారని, ఈ నెల 21 న పట్టిసీమ రైతులు ఉల్లిపాలెంలో చంద్రబాబును సన్మానిస్తారని చెప్పారు. ప్రజలంతా రాష్ట్రంలో జగన్‌, పవన్‌ కళ్యాణ్‌ల తీరును చూసి చీదరించుకుంటున్నారని అన్నారు. రాబోయే కాలంలో మళ్లీ తెదేపాకు పట్టంకట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఉమామహేశ్వరరావు అన్నారు.