పోలవరంపై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా
కెవిపి వ్యాఖ్యలపై మండిపడ్డ కోడెల
గుంటూరు,ఆగస్ట్15(జనం సాక్షి): పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తనకు లేఖ రాయడంపై సభాపతి కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. జులై 31న రైతులతో కలిసి పోలవరం ప్రాజెక్టు సందర్శించినప్పుడు ఈ ప్రభుత్వం రాక ముందు 2 శాతం పనులు మాత్రమే జరిగాయని కోడెల చెప్పారు. దీనిపై కోడెల అసత్యాలు మాట్లాడుతున్నారంటూ కేవీపీ ఆయనకే లేఖ రాశారు. దీనిపై కోడెల మండిపడ్డారు. కేవీపై వైఖరిని ఖండించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఈ మేరకు విూడియాతో మాట్లాడారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు సభాపతి స్పష్టం చేశారు.కాంగ్రెస్ పాలనలో రూ.5,136 కోట్లు పోలవరానికి ఖర్చు చేసినట్లు చూపించారని, ఇందులో హెడ్ వర్క్స్ కోసం ఖర్చు చేసింది కేవలం రూ.179 కోట్లేనని సభాపతి గుర్తు చేశారు. మట్టి పనులు చేసి మిగతా డబ్బులు తీసుకున్నారని కోడెల ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వంలోనే పోలవరం, పట్టిసీమ పాజెక్టులు సాకారమవుతున్నాయని చెప్పారు. ప్రతిష్ఠాత్మకమైన పోలవరం పనులకు కేవీపీ అడ్డుతగలడం భావ్యం కాదన్నారు. సభాపతికి లేఖ రాయడం, ఫిర్యాదులు చేయడం సంప్రదాయం కాదని సూచించారు. ప్రతి అంశాన్నీ రాజకీయ కోణంలో చూడటం మానుకోవాలని హితవు పలికారు. వైఎస్ దుర్యోధనుడైతే, కేవీపీ శకుని లాంటి వారని సభాపతి కోడెల వ్యాఖ్యానించారు.